Jagadhatri Serial Today Episode: శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేందుకు పథకం వేసిన వైజయంతి అందరూ నిద్రపోయిన తర్వాత వెనక తలుపులు తెరిచి తాను నియమించుకున్న వ్యక్తిని ఇంట్లోకి రప్పిస్తుంది. మెల్లగా అతన్ని శ్రీవల్లి ఉన్న గదిలోకి పంపుతుంది. అంతకు ముందే శ్రీవల్లి గదికి తలుపు వేసుకోకుండా చేసిన వైజయంతి ఆ గదిలోకి అతన్ని పంపుతుంది. గాడనిద్రలో ఉన్న శ్రీవల్లి అతను వచ్చిన విషయం గమనించదు. దీంతో అతను వెళ్లి శ్రీవల్లి పక్కన పడుకుంటాడు. ఇంతలో వైజయంతి వెళ్లి జగధాత్రి, కేదార్‌ను నిద్రలేపుతుంది. మంచినీళ్లకోసం వెళ్తుంటే ఇంట్లోకి ఎవరో వచ్చినట్లు అనిపించిందని చెబుతుంది. జగధాత్రి, కేదార్ వచ్చి శ్రీవల్లి రూమ్‌లో చూడగా....ఆ వచ్చిన వ్యక్తి శ్రీవల్లి పక్కనే పడుకుని ఉండటం చూసి షాక్‌కు గురవుతారు. ఇంతలో నిషిక, యువరాజుతోపాటు, కౌషికి సుధాకర్ కూడా కిందకు వస్తారు. వచ్చిన వాడిని కట్టేసి ఇంటి మధ్యకు తీసుకొచ్చి కూర్చోబెడతారు. వైజయంతి,నిషిక ఇద్దరూ కలిసి శ్రీవల్లిపై అబండాలు వేస్తుంటే...జగధాత్రి, కేదార్ ఆమెకు సపోర్ట్ చేస్తారు.అసలు విషయం తెలుసుకోకుండా నిందలు వేయడం మంచిది కాదంటారు. వచ్చినవాడిని ఎవరని...ఎందుకు మా ఇంట్లోకి వచ్చావని సుధాకర్ నిలదీస్తాడు. మా ఇంటి అమ్మాయి గదిలో నువ్వు ఎందుకు ఉన్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తాను శ్రీవల్లి ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని...శ్రీవల్లి రమ్మంటేనే ఇక్కడికి వచ్చానని అతను అబద్ధం చెబుతాడు. ఇంతలో జగధాత్రి ఏం జరిగిందని...అతను చెప్పేదంతా నిజమేనా అని శ్రీవల్లిని అడుగుతుంది. దేవుడి ప్రమాణంగా అతను ఎవరో నాకు తెలియదని...నేను తనను ఎప్పుడూ చూడలేదని చెబుతుంది. గతంలో ముగ్గు వేస్తున్నప్పుడు కూడా వచ్చి నామీద కావాలనే పడ్డాడని చెబుతుంది. ఇతను ఎవరో కూడా నాకు తెలియదని...ఎందుకు నా రూమ్‌లోకి వచ్చాడో తెలియదని అంటుంది. ఆ మాటలు విన్న వైజయంతి...శ్రీవల్లిపై చేయిచేసుకుంటుంది. నిజం బయటపడేసరికి నాటకాలు ఆడుతున్నావా అని కొడుతుంది.
ఆమెను వారించిన కౌషికి శ్రీవల్లికి అండగా నిలుస్తుంది.సుదాకర్ కూడా కూతురువైపే నిలబడతాడు. దీనికి ఏం తెలియకపోతే వాడు ఇంట్లోకి ఎలా వచ్చాడని...డైరెక్ట్‌గా శ్రీవల్లి రూంలోకి ఎలా వెళ్లాడని వైజయంతి నిలదీస్తుంది. శ్రీవల్లి చెప్పిన మాటలతో జగధాత్రికి అనుమానం వస్తుంది. ఇదంతా ఎవరో కావాలనే ప్లాన్‌చేసి చేశారని గ్రహిస్తుంది. ఇదంతా విన్న కేదార్ వచ్చిన వాడి చొక్కాపట్టుకుని గట్టిగా నిలదీస్తాడు. శ్రీవల్లి అనాథ ఆశ్రమంలో ఉన్నప్పటి నుంచే ప్రేమించుకున్నామని...మీకు తెలియకుండా ఈఇంటికి చాలాసార్లు వచ్చానని చెబుతాడు. దీంతో జగధాత్రి కలుగజేసుకుటుంది...నువ్వూ శ్రీవల్లి ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు కదా...మీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఒక్కటైనా చూపిస్తే నువ్వు చెప్పేది నిజమని నమ్ముతామని జగధాత్రి నిలదీస్తుంది. దీంతో అతను కొంత కంగారుపడతాడు. సరే ఫోటోలు లేకపోయినా పర్వాలేదని కనీసం శ్రీవల్లి ఫోన్ నెంబర్ అయినా నీ దగ్గర ఉంటే చూపించాలని ధాత్రి నిలదీస్తుంది. జగధాత్రి ప్రశ్నలకు నీళ్లు నమిలిన వాడు తెల్లముఖం వేస్తాడు. తాము వేసిన ప్లాన్ మరోసారి అట్టర్‌ప్లాప్ అవుతుందని వైజయంతి, నిషిక నిరాశపడతారు. అయితే కేదార్ వాడిని పట్టుకుని ఈ పని నీతో ఎవరు చేయించారో చెప్పని గట్టిగా నిలదీస్తాడు. దీంతో వాడు తడబడుతుండగా....వైజయంతి, నిషిక వైపు చూస్తుంటాడు. తమ పేర్లు ఎక్కడ చెప్పేస్తాడేమోనని అత్తా, కోడళ్లు ఇద్దరూ భయంతో చచ్చిపోతారు. దీంతో వాళ్లిద్దరే ఈ పని చేయించారని జగధాత్రికి అర్థమైపోతుంది.ఇంతలో వైజయంతి వాడిని పారిపొమ్మని సైగ చేయడంతో వాడు పారిపోతాడు. దీంతో ఆత్తా కోడళ్లు ఊపిరి పీల్చుకుంటారు. శ్రీవల్లియే పారిపొమ్మని సైగ చేసి ఉంటుందని వైజయంతి అంటుంది.ఇంత జరిగిన తర్వాత శ్రీవల్లిని ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని నిషిక మాట కలుపుతుంది. ఇంట్లో నుంచి ఇప్పుడే బయటకు పొమ్మని అంటారు. ఆ మాటలకు జగధాత్రి అడ్డుపడుతుంది. శ్రీవల్లి ఎక్కడికి వెళ్లదని అంటుంది. శ్రీవల్లి చెప్పిందే నిజమే అయితే..అసలు వాడు ఇంట్లోకి ఎలా వచ్చాడని నిలదీస్తుంది. ఎవరు వాడిని శ్రీవల్లి గదిలోకి పంపారని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మాకు ఏం తెలుసని వైజయంతి అంటుంది. శ్రీవల్లి వచ్చినప్పటి నుంచి తనను ఇంట్లో నుంచి గెంటివేసేందుకు నువ్వు ఏదో ఒకటిచేస్తున్నావని సుధాకర్ కూడా అంటాడు.ఇప్పుడు కూడా నువ్వు ఇదంతా చేయలేదని నమ్మకం ఏంటని నిలదీస్తాడు. ఇంట్లో శ్రీవల్లి అయినా ఉండాలి లేదా నేను అయినా ఉండాలని వైజయంతి పట్టుబడుతుంది. వైజయంతి మాటలకు అడ్డుపడిన కౌషికి...త్వరలోనే శ్రీవల్లికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లిచేద్దామని...అప్పటి వరకు తను ఇక్కడే ఉంటుందని అంటుంది. దీనికి అత్తాకోడళ్లు ఇద్దరూ సరేనంటారు. దీంతో ధాత్రి శ్రీవల్లిని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. దీంతో వైజయంతి, నిషిక సంతోషపడతారు. శ్రీవల్లి నిజం చెప్పిందని అనిపిస్తోందని కేదార్ జగదాత్రితో అంటాడు. మన ఇంటికి వచ్చిన వాడు ఎవడో పట్టుకుని ఇదంతా వాడు ఎందుకు చేశాడో కనుక్కుంటానంటాడు.అప్పుడే శ్రీవల్లి ఈ ఇంట్లో తలెత్తుకుని తిరగగలదని అంటాడు. అత్తయ్య అన్న మాటలకు శ్రీవల్లి ఏమైనా చేసుకుంటుందని ఆమెకు అండగా ఉండాలని ధాత్రి అంటుంది.ఇంతలో శ్రీవల్లి ఇంట్లో కనిపించకుండా పోతుంది. నిజం బయటపడేసరికి పారిపోయి ఉంటుందని నిషిక అంటుంది. దిక్కుముక్కు లేనివాడితో లేచిపోయి ఉంటుందని వైజయంతి అనగా....కేదార్ కోపంతో ఆమెపై గట్టిగా అరుస్తాడు. నా చెల్లి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోనని అంటాడు. జగధాత్రి కల్పించుకుని శ్రీవల్లిని ముందు వెతుకుదామనగా...అందరూ వెళ్లిపోతారు.