Jagadhatri Serial Today Episode: మీనన్‌ దగ్గర ఇన్నాళ్లు పనిచేసిన నీకు మీ అమ్మ మీనన్‌ కోసం పనిచేస్తోందని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని కేదార్‌ యువరాజుతో అంటాడు. పిన్నికి మాతో ఎలాంటి ఇబ్బంది ఉండదని...కాకపోతే మీనన్‌ సంగతి తెలిసిన నీకు మీ అమ్మకు వచ్చే కష్టం గురించి నేను చెప్పాల్సిన పనిలేదని చెప్పి జేడీ,కేడీ వెళ్లిపోతారు. ప్రస్తుతానికి గండం నుంచి గట్టేక్కానని ఊపిరి పీల్చుకుంటున్న వైజయంతి వద్దకు యువరాజు కోపంగా వస్తాడు. మీనన్‌తో చేతులు కలిపావా అని నిలదీస్తాడు. దీంతో ఆమె మరింత వణికిపోతుంది. ఈలోగా నిషి కలుగజేసుకుని అత్తయ్య మీనన్‌తో ఎందుకు చేతులు కలుపుతుందని అంటుంది. మనం ఇంట్లో పడుతున్న అవమానాలు చూడలేక మా అమ్మ వాడికోసం పనిచేస్తోందని నాకు అనుమానంగా ఉందని యువరాజు అంటాడు. ఈ మొత్తం బిజినెస్‌ను నా గుప్పిట్లోకి తీసుకోవడానికే నేను ఇన్ని అవమానాలు భరిస్తున్నానని....అది నాచేతికి వచ్చే సమయానికి నువ్వు ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేస్తే తల్లివి అని కూడా చూడకుండా చంపేస్తానంటూ  ఆమెకు తుపాకీ గురిపెట్టి బెదిరిస్తాడు. నాకు ఇప్పటికి ఉన్న తలనొప్పులు చాలని...కొత్తగా నువ్వు ఏమీ తీసుకొచ్చి నా దారికి అడ్డుపడొద్దని తల్లిని హెచ్చరించి వెళ్లిపోతాడు.                          బయట నుంచి లోపలకి వచ్చిన జగధాత్రి, కేదార్‌ను  కౌషికి నిలదీస్తుంది. ఎప్పుడూ  చెప్పాపెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోతున్నారని అడుగుతుంది. కేదార్‌వాళ్లప్రెండ్‌కు ఏదో అర్జెంట్ పని ఉంటే వెళ్లామని జగధాత్రి చెబుతుంది. మీరు బయటకు వెళ్లిన ప్రతిసారీ ఇంట్లో ఏదో రచ్చ జరుగుతోందని కౌషికి అంటుంది.ఇకపై బయటకు వెళితే తప్పనిసరిగా చెప్పే వెళ్తామని కేదార్ అంటాడు. వాళ్లు మాట్లాడుతుండగానే అక్కడికి  సుధాకర్‌ తమ్ముడు కమలాకర్‌ వస్తాడు.అందరినీ పలకరిస్తూ కౌషికితో మాట్లాడుతుంటాడు. జగధాత్రి, కేదార్ మాట్లాడటానికి ట్రై చేసినా అతను పట్టించుకోడు.                            కేదార్ దగ్గరకు వెళ్లి ఎప్పుడు వచ్చావ్ బాబాయి అని అనగానే...కోపంతో రగిలిపోతాడు. ఎవడ్రా నువ్వు ...నేను నీకు బాబాయి ఏంటని మండిపడతాడు. సిగ్గులేకుండా ఈ ఇంటిని పట్టుకుని వ్రేలాడుతున్నారేంటని జగధాత్రిని అంటాడు. ఇంతలో కౌషికి, సుధాకర్‌ సర్దిచెప్పబోయేసరికి వాళ్లపైనా మండిపడతాడు. ఇంటికి సంబంధం లేనివాళ్లను ఇంట్లో పెట్టుకుని ఎందుకు పరువు తీస్తున్నారని అంటాడు. ఎవడికి పుట్టాడో తెలియని అలగా జనాలను ఎందుకు ఇంట్లో ఉంచుతున్నారని అంటాడు. దీనికి కౌషికి,యువరాజు కూడా వంతపాడతారు. బయట వాళ్లమీద చూపించే ప్రేమ మా మీద కూడా చూపించడం లేదని...వీళ్లు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోఅంతా గొడవలేనని అంటారు. మామయ్య ఇంత చెప్పినా సిగ్గులేకుండా ఇంకా ఎందుకు ఉన్నారని నిషిక అంటుంది. మర్యాదగా బయటకు వెళ్లిపోండని అంటుంది. దీనికి జగధాత్రి కూడా గట్టిగా బదులిస్తుంది. మీరు ఎన్ని చెప్పినా కేదార్ ఈ ఇంటి వారసుడని అంటుంది.అయితే  ఆధారాలు చూపించండని కమలాకర్ నిలదీస్తాడు.నెలరోజుల్లో  ఆధారాలు తీసుకొస్తామని చెప్పి ఇప్పటికీ ఎందుకు చూపించడం లేదని అంటాడు.                       కేదార్ ఈ ఇంటివారసుడని మీ  అందరికీ తెలిసినా...మీ పరువు, ప్రతిష్ఠ కోసం ఒప్పుకోవడం లేనది జగధాత్రి మండిపడుతుంది. మీ బిజినెస్‌లు దెబ్బతింటాయని అంగీకరించడం లేదని అంటుంది. నిజంగా నువ్వు చెబుతుంది నిజమే అయితే  అందుకు తగిన ఆధారాలు రేపటిలోగా చూపించమని నిషిక నిలదీస్తుంది. దీంతో జగధాత్రికి కోపం వస్తుంది. రేపటిలోగా కేదార్ ఈ ఇంటి వారసుడుని నిరూపిస్తానంటూ  ఇంట్లోకి వెళ్లిపోతుంది.