Jagadhatri Serial Today Episode :  మీనన్‌ ఇంటికి వచ్చాడని కౌషికి చెప్పడంతో అందరూ వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తారు. అక్కడ కేవలం బెలూన్లు  అడ్డుగా ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. అన్ని కెమెరాలకు బెలూన్లు ఎలా అడ్డువచ్చాయని అనుమానిస్తారు. సీసీ ఫుటేజ్‌లో మీనన్ కనిపించకపోవడంతో నిషిక వాళ్లు ఈ వ్యవహారాన్ని ఇక ఇంతటితో వదిలేయాలని చెప్పి వెళ్లిపోతారు. కానీ కౌషికి మాత్రం మీనన్‌ వచ్చి బెదిరించాడనే నమ్ముతుంది. జగధాత్రి ఆమె వద్దకు వెళ్లి  చనిపోయిన మీనన్ తిరిగి వచ్చాడంటే ఎవరూ నమ్మరు వదినా...కాకపోతే ఆ రూమ్‌లో మీరు కాకుండా ఇంకొకరు ఉన్నారన్నది మాత్రం నిజం అంటుంది. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. రాత్రి డిన్నర్‌ కోసం జగధాత్రి,కేదార్ వంట రెడీ చేస్తుంటారు. ధాత్రి చేతికి దెబ్బ ఉండటంతో కేదార్‌ కూరగాయలు కోస్తుంటాడు. అదేంటి నువ్వు వంట చేస్తున్నావని అడిగితే....జగధాత్రి ఇచ్చిన పనిష్‌మెంట్  అని చెబుతాడు. నేను దగ్గర ఉండి అన్ని పనులు చేయిస్తానని చెప్పడంతో వాళ్లంతా వంట గదిలో నుంచి వెళ్లిపోతారు.                  చికెన్, బిర్యానీ వండటానికి అన్ని సిద్ధం చేసిన తర్వాత కొత్తిమీర లేకపోడంతో నేను షాపుకు వెళ్లి తీసుకొస్తానని జగధాత్రి బయటకు వెళ్తుంది. ఫోన్‌లో వంట ఎలాచేయాలో కేదార్‌కు చెబుతుంటుంది. అలా బయటకు వెళ్లిన జగధాత్రికి ఉమెన్స్ హాస్టల్ వద్ద గంజాయి తాగి అమ్మాయిలను ఏడిపిస్తున్న రౌడీబ్యాచ్‌ ఎదురుపడుతుంది. వాళ్లను చితక్కొడుతూనే కేదార్‌కు చికెన్ ఎలా చేయాలో చెబుతుంటుంది ధాత్రి. ఈలోగా రమ్యకు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె కానిస్టేబుల్‌తో అక్కడికి చేరుకుని గంజాయి బ్యాచ్‌ను పట్టుకుంటుంది.ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందిరా అని వాళ్లను నిలదీస్తుంది జగధాత్రి. ఎంత అడిగినా తమకు తెలియదని వాళ్లు సమాధానం చెబుతారు. అయితే మీ ఆ మ్మవాళ్లను పిలిపించి మాట్లాడతామని చెప్పడంతో భయపడిపోయిన వాళ్లు....తమకు ఏం తెలియదని మేం ఫోన్‌లో ఎంత గంజాయి కావాలో మాత్రమే చెబుతామని....వాళ్లు బైక్‌ ఎక్కడ పార్క్ చేయాలో చెబుతారని అంటారు. బైక్‌ కవర్‌లో డబ్బులు తీసుకుని వాళ్లే అందులో గంజాయి పెట్టి వెళ్లిపోతారని చెప్పడంతో ...జగధాత్రి వీళ్ల దగ్గర ఆ నెంబర్ తీసుకుని రేపు వీళ్లలాగే మెసెజ్‌ పెట్టమని రమ్యకు చెబుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ  ఆ గంజాయి డీలర్‌ తప్పించుకోకూడదని చెప్పి ఇంటికి వెళ్లిపోతుంది.అప్పటికే కేదార్‌ చికెన్ బిర్యానీ రెడీ చేసి  ఉంచుతాడు.                     తెల్లారి శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్‌ కోసం ఇంట్లో అంతా హడావుడిగా  పనులు చేస్తుంటారు కేదార్‌, జగధాత్రి.అది చూసి నిషిక, వైజయంతికి అనుమానం వస్తుంది. వీళ్లిద్దరూ ఏంటీ ఇంత హడావుడి చేస్తున్నారని అనుకుంటారు. ఈ ఎంగేజ్‌మెంట్ ఎలా ఆపుతామని జగధాత్రి అనగా....మనం ఏం చేయాల్సిన పనిలేదని మనం కొట్టేసిన డబ్బు కోసం వాళ్లే కొట్టుకుని ఒకరిపైఒకరు చెప్పుకుని బయటపడిపోతారని అంటుంది. ఇంతలో పెళ్లికొడుకు రావడంతో కౌషికి వీళ్లను తీసుకుని రిసీవ్‌ చేసుకోవడానికి వెళ్తుంది. వాళ్లకు స్వాగతం పలికిన తర్వాత...నిషిక, వైజయంతి కలిసి పెళ్లికొడుకుని నాలుగు ఫొటోలు తీయించుకుని తీసుకొస్తామని చెప్పడంతో కౌషికి వెళ్లిపోతుంది.అప్పుడు వైజయంతి కోటిరూపాయల బ్యాగ్ తీసుకొచ్చారా అని అడగగా....మా దగ్గర కొట్టేసిన డబ‌్బుల్లో వాటా  ఇవ్వండని రాజు అంటాడు.  దీంతో వాళ్లు గొడవపడతారు. మర్యాదగా డబ్బులు ఇవ్వకపోతే పోలీసులను పిలుస్తామని చెబుతుంది నిషిక. దీంతో బయపడిపోయిన రాజు...నిజంగా ఆ కోటిరూపాయలు మేం తీసుకుని ఉంటే...మళ్లీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చేవాళ్లమని అటునుంచి అటే వెళ్లిపోయేవాళ్లం కదా అని అంటారు. అయితే మీరు మా దగ్గర నుంచి తీసుకుని వెళ్లిన 10నిమిషాల్లోనే ఆ బ్యాగ్ ఎవరు కొట్టేసి ఉంటారని వైజయంతి అంటుంది. ఇంకెవరు ఆ జగధాత్రి, కేదార్‌ పనేనని నిషిక చెబుతుంది. మనం మనం కొట్టుకుని బయటపడాలనే వాళ్లు ఈ ప్లాన్ వేశారని చెప్పడంతో వైజయంతి నోరు వెళ్లబెడుతుంది. అయ్యిందేదో అయ్యింది ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రాజును లోపలికి తీసుకెళ్తుంది నిషిక. అటు గంజాయి బ్యాచ్‌ కోసం ఫోన్‌లో రమ్యకు ఇన్‌స్ట్రక్షన్లు ఇస్తుంటుంది జేడీ...డ్రగ్‌ డీలర్‌ దొరికాడని చెప్పగానే అరెస్ట్‌ చేయండని ధాత్రి అనడం కౌషికి వింటుంది.