Illu Illalu Pillalu Serial Today Episode నర్మద సంతోషంగా అత్తయ్యని పిలిచి చేతిలో ఓ కవర్ పట్టుకొని సిగ్గుతో మెలికలు తిరిగిపోతుంది. ఏంటమ్మ సిగ్గుతో బొంగరాలు తిరిగేస్తున్నావ్ అంటే.. ఒక గుడ్‌ న్యూస్ అత్తయ్య అని నర్మద అంటుంది. నర్మద చెప్పబోతే వేదవతి ఆపి.. నాకు తెలుసులే నా గవర్నమెంట్ కోడలు నెలతప్పింది అంటుంది. 

నర్మద, అత్తల మాటలు చాటుగా వింటున్న శ్రీవల్లి నోరెళ్లబెడుతుంది. వల్లి రగిలిపోతూ ఇప్పుడే అత్త ఆ నర్మదని నెత్తిమీద పెట్టుకుంటుంది. ఇక మేడం కాలు కింద పెట్టనివ్వదు అని అనుకుంటుంది. నర్మద అత్తతో మీకు ఎప్పుడూ అదేనా ఆ గుడ్‌న్యూస్ తర్వాత చెప్తా కానీ ఇప్పుడు అది కాదు నాకు ప్రమోషన్ వచ్చింది అని చెప్తుంది. వల్లీ షాక్ అయిపోతుంది. ఈ విషయం ప్రేమకి చెప్తే చాలా సంతోషపడుతుంది పద అని వేదవతి, నర్మద ప్రేమ దగ్గరకు వెళ్తారు. వల్లి కోపంగా ప్రేమకి చెప్పాలి అని వెళ్తున్నారు కానీ నాకు చెప్పాలి అని వీళ్లకి లేదు అసలు వీళ్ల దృష్టిలో నేను లేనట్లేనా అనుకుంటూ కోపంలో బయటకు వెళ్లి తోడా ప్యాస్ దాలో అంటూ విపరీతంగా పానీ పూరీ తినేస్తుంది. 

భాగ్యం, ఆనంద్‌రావులు వల్లీని చూసి తీసుకొని పక్కకి వెళ్లి అల్లుడికి ఇవ్వడానికి పది లక్షలు దొరికాయని.. విశ్వకి అమూల్యకి పెళ్లి చేసేలా సెట్ చేయాలని అంటుంది. శ్రీవల్లి కోపంగా అప్పుడు నేను ఊబిలో కూరుకుపోతా.. ఆ రెండు కుటుంబాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. నేను వాళ్ల మధ్యలో రాయభారం చేస్తే మా మామయ్య చంపేస్తారు. పైగా ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం నేనేం చేయను.. మీకో దండం.. నా వెనకాలే వస్తే మీ ఇద్దరి కాళ్లు విరగ్గొడతా.. వెళ్లిపోండి అని వెళ్లిపోతుంది. అమ్మడును ఎలా ఒప్పించాలో నాకు తెలుసు అని భాగ్యం వెనకాలే వెళ్తుంది. 

ప్రేమకి కల్యాణ్‌ కాల్ చేసి నీకు ఇచ్చిన టైంలో అరగంట అయిపోయింది. నువ్వు వస్తావా నేనే ఆధారాలతో మీ మామ దగ్గరకు వెళ్లాలా అని కల్యాణ్‌ అడిగితే నేనే వస్తాను అని ప్రేమ అంటుంది. దానికి కల్యాణ్‌ అబ్బబ్బా అయితే నీ కోసం రొమాంటిక్‌ కలలు కంటూ ఉంటానని అంటాడు. ప్రేమ కోసం నర్మద, వేదవతిలు ప్రేమని వెతుక్కుంటూ రోడ్డు మీదకు వచ్చేస్తారు. నీ కోసం మొత్తం వెతుక్కొని వచ్చాం నువ్వేంటి కంగారు పడుతున్నావ్ సీరియస్‌గా మాట్లాడాలి అని ముగ్గురు పక్కకి వెళ్తారు. 

నర్మద, వేదవతిలు ప్రేమతో నాలుగు రోజుల నుంచి బాధ పడుతున్నావ్ మాతో సరిగా మాట్లాడటం లేదు.. అసలేమైంది అని అడుగుతారు. నర్మద తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్తుంది. ప్రేమ చాలా సంతోషపడుతుంది. వేదవతి ఇద్దరు కోడళ్లని దగ్గరకు తీసుకొని ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారని నాకు దిగులు ఉండేది కానీ అదంతా పోయింది.  మీ ఇద్దరూ మీ మామయ్యని గర్వంగా తలెత్తుకునేలా చేస్తారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉందని అంటుంది. ప్రేమకి ఇద్దరూ ఏమైందని అడుగుతారు. ప్రేమ చెప్పదు ఏం లేదు అనేస్తుంది. 

నర్మద ప్రేమతో నీతో ఎలా చెప్పించాలో మాకు తెలుసు అని ధీరజ్‌కి కాల్ చేసి నీ భార్య ఎలా ఉందో పట్టించుకోవా అని అంటుంది. దాంతో ధీరజ్ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి వదిన వందల సార్లు అడిగినా చెప్పడం లేదు అని అంటాడు. చెప్పడం లేదు అంటే తను పెద్ద ప్రాబ్లమ్‌లో ఉందని అర్థం. తను నీకు చెప్పాలి అనుకొని ఉంటే నువ్వు కోప్పడి ఉండొచ్చు.. ఏది ఏమైనా తన బాధ పొగొట్టాల్సిన బాధ్యత నీదే అని ధీరజ్‌ని రమ్మని చెప్తుంది. వేదవతి, నర్మదలు ప్రేమ బాధ్యత ధీరజ్‌కి అప్పగించి తన బాధ్యత పోయేలా నువ్వే చేయాలి అని చెప్పి వెళ్లిపోతారు. 

ధీరజ్ ప్రేమ దగ్గరకు వెళ్తే ప్రేమ వెళ్లిపోతుంది. ధీరజ్ వెనకాలే వెళ్లి డ్రాప్ చేస్తారా అని బైక్ ఎక్కించుకుంటాడు. ఈ సీన్ చూస్తే బేబీ మూవీలో హీరో హీరోయిన్‌ని మరో వ్యక్తి దగ్గరకు డ్రాప్ చేసినట్లు ఉంటుంది. ఓ చోట ప్రేమ ఆపి నడిచి వెళ్తుంటే ధీరజ్ చేయి పట్టుకొని ఆపి.. మనకు ఏదైనా కష్టం వస్తే మొదట గుర్తుకు రావాల్సింది నా అనే వాళ్లు మరి నీకు నేను నా అని అనిపించడం లేదా.. నీ బాధ నాకు చెప్పుకోవాలి అనుకోవడం లేదా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.