గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 11 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 11 Episode)
బాలు మీనా మొదటి పెళ్లి రోజు సంతోషంగా జరిగింది. అవమానించాలని, తక్కువ చేయాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీనా బాలు ధీటుగా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. డ్రైవర్ ఉద్యోగం ఇస్తానని సంజయ్ అవమానించాడు- తన కారు తను నడుపుకోవడంలో ఆనందం ఉందని ఇచ్చిపడేశాడు బాలు . బంగారు గాజులు గిఫ్ట్ గా ఇచ్చి అవమానించింది శ్రుతి తల్లి - ఆ గాజులు తీసుకుని బావున్నాయని చెప్పిమరీ శ్రుతి చేతికి వేసేసి షాకిచ్చింది మీనా. ఒక్కొక్కరుగా బాలు మీనా గురించి మాట్లాడారు. రోహిణి-మనోజ్ తమ మనసులో కుళ్లు బయటపెట్టారు. రవి-శ్రుతి..బాలు మీనా గురించి గొప్పగా మాట్లాడతారు.
సత్యం వంతు వచ్చేసరికి.. ..మీ ఇద్దర్నీ దేవుడే కలిపాడంటూ గొప్పగా మాట్లాడి కొడుకు కోడలిని చూసి మురిసిపోతాడు. ప్రభావతిని మాట్లాడమంటుంది సుశీలమ్మ. ఈ పెళ్లిని సమాజం కోసం ఒప్పుకుని తీరాలనే ఒప్పుకున్నా... వీడు పుట్టినప్పటి నుంచీ భరించలేకపోయాను, వీడితో ఏ భార్యా కాపురం చేయలేదు అనుకున్నా కానీ ఇది మొండిది.. సర్దుకుపోతూ కాపురాన్ని కాపాడుకుంది అంటుంది.
బాలు
నాకు పెళ్లికాకముందు ఈ ఇంట్లో నన్ను మనిషిగా చూసేది మా నాన్న మాత్రమే... వీడు డబ్బు మింగిపారిపోయిన తర్వాత నా జీవితం మలుపు తిరిగింది. మీనా నన్ను మార్చేయలేదు..తనకోసం నన్ను నేను మార్చుకున్నాను తనకి థ్యాంక్స్ అంటాడు
మీనా
నాకు పెద్దగా మాట్లాడడం రాదు ... సంవత్సరం క్రితం ఇదే రోజు ఎందుకు ఇతన్ని పెళ్లిచేసుకున్నా అని బాధపడ్డాను కానీ ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఇలాంటి వ్యక్తి దొరికాడు అనిపిస్తుంది. నాకు రేపు పిల్లలు పుట్టినా నాకు మొదటి పిల్లడు ఈయనే అవుతాడు. గొడవలు పడుతూ కనిపించే ఈయన మనసులో వెలితి, బాధ ఉంది కానీ అది ఎందువల్లో నేను తెలుసుకోలేకపోయాను అంటుంది
మౌనిక
భార్యని భర్త ఎలా ప్రేమించాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోవాలి. కాపురం ఎలా నిలబెట్టుకోవాలో మా వదినను చూసి నేర్చుకోవాలి .మేం కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను అంటుంది మౌనిక.
ఆ మాటకు ఇంట్లో అంతా షాక్ అవుతారు. మేం కూడా అలానే ఉండాలని అనడం, భార్యని భర్త ఎలా ప్రేమించాలో అన్న మాట విని... అంటే మౌనిక సంతోషంగా లేదా అనే సందేహం అందర్లోనూ మెదులుతుంది. ఇక ఇక్కడుంటే మౌనిక నిజం చెప్పేస్తుందేమో అనే భయంతో ఇక ప్రసంగాలు అయితే వెళదాం అంటాడు సంజయ్. సరే అని అందరకీ పేరు పేరునా చెప్పేసి వెళ్లిపోతుంది మౌనిక.
నేను కారు వరకూ వస్తానమ్మా ఆగు అని బాలు వెంటే వెళతాడు. బయటకు వెళ్లిన తర్వాత మౌనికతో మాట్లాడుతాడు బాలు.. ఎవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు వాళ్ల సంగతి నేను చూసుకుంటాను అని సంజయ్ వైపు చూసి అంటాడు. అదేం లేదు అన్నయ్యా నేను సంతోషంగా ఉన్నాను అని అబద్ధం చెప్పి వెళ్లి కార్లో కూర్చుంటుంది మౌనిక. ఆ తర్వాత సంజయ్ కారెక్కుతుండగా డోర్ తీసి పట్టుకుంటాడు బాలు. అహంకారంతో చూస్తాడు సంజయ్.. అయితే డోర్ తీసిన బాలు..సంజయ్ వేళ్లు నొక్కుకునేలా గట్టిగా వేస్తాడు. అమ్మా అని గట్టిగా అరుస్తాడు సంజయ్.. నా చెల్లి బాధపడితే నేను బాధపడతాను..ఆ తర్వాత నువ్వు రెట్టింపు బాధపడతావు..గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు. కోపంగా వెళ్లిపోతాడు సంజయ్
ప్రభావతి-రోహిణి
ఫంక్షన్ బాగా జరిగింది కదా అని అంటుంది. అందరూ వచ్చారు వెళ్లారు..అందరూ వస్తున్నారు వెళుతున్నారు కానీ మీ ఇంట్లో వాళ్లు ఎవ్వరూ రావడం లేదు..మీ అమ్మ ఎలాగూ లేదు, మీ నాన్న కనీసం మొహం కూడా చూపించలేదంటుంది. ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా అని రోహిణి అంటే అంతకుముందు వారానికోసారి వచ్చేవాడా ఏంటి అని నిలదీస్తుంది. రావాలనే నేను కోరుకుంటున్నా..మీ వాళ్లు ఎవరూ రావడం లేదని ఇంట్లో అందరూ అంటున్నారు..అందుకే చెప్తున్నా అనేసి వెళ్లిపోతుంది
తల్లితో మాట్లాడిన రోహిణి ( కళ్యాణి)
తల్లికి కాల్ చేస్తుంది రోహిణి.. అమ్మా కళ్యాణీ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది. కొడుకు గురించి అడిగి తెలుసుకుంటుంది. నీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది. ఇంట్లో బాలు మీనా పెళ్లిరోజు జరిగింది. వాళ్లిద్దరూ మీనా పుట్టింటికి వెళ్లొచ్చారు..అందరూ వచ్చారు..సందడిగా గడిపారు. నాకు అర్థమైంది లేమ్మా నీ బాధ అంటుంది తల్లి. నేనున్నా లేనట్టే నిన్ను అందర్లో సంతోషంగా చూడాలని నాక్కూడా ఉంది కానీ ఏం చేస్తాను అని బాధపడుతుంది. వచ్చేవారం ఇంటికి వస్తున్నా అని చెప్పి మనోజ్ రావడంతో కాల్ కట్ చేస్తుంది. నేను బయటకు వెళుతున్నా అని చెప్పేసి వెళ్లిపోతాడు మనోజ్.
ఉప్పు మిరపకాయలు ఎక్కడా అని సుశీలమ్మ అడుగుతుంది..ఇప్పుడేం పచ్చడి చేస్తారని అడిగితే వాళ్లకి తగిలిన దిష్టిని పచ్చడి చేస్తాను అంటుంది. మిగిలినవాళ్లకి కూడా తీయండి అంటుంది. శ్రుతి సంపాదిస్తోంది, రోహిణి మనోజ్ షాప్ ఓపెన్ చేయబోతున్నారు కదా అంటుంది. వాళ్లే నేను సెలెక్ట్ చేసిన కోడళ్లు కాబట్టి వాళ్లకు సపోర్ట్ చేస్తాను అంటుంది. నాకు అందరూ ఒకటే నీకూ సత్యానికి కూడా దిష్టితీస్తాను అంటుంది సుశీలమ్మ. మాకెందుకు అంటే.. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయ్? నువ్వు కాబట్టి అందర్లీ అదుపులో పెట్టుకున్నావ్ అంటుంది. మీ ఇద్దరూ మాటలతో యుద్ధం చేసింది చాలు దిష్టి తీయండి అంటాడు బాలు.
నాకు నిద్రవస్తోంది పరుపు తీసుకుని రా అంటాడు బాలు. ఏం జరుగుతోంది ఇంట్లో అని సుశీలమ్మ అడుగుతుంది. మిగతా ఇద్దరికీ రూమ్స్ ఇచ్చి బాలు మీనాకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతారు. రోహిణి, శ్రుతి పొద్దున్నే లేచి రెడీ అయి వెళ్లాలి కదా.. అంటే..అందరికన్నా ముందు నిద్రలేచేది వాళ్లిద్దరే కదా ఎందుకు వాళ్లని తక్కువ చేస్తున్నావని నిలదీస్తుంది. అమ్మా నాన్న ఇబ్బందిపడకూడదని మేమే ఇచ్చాం అంటాడు బాలు. నీకే ఎందుకు అనిపించాలి? ఈ పెద్ద దున్నపోతు, చిన్నదున్నపోతుకి ఎందుకు అనిపించలేదని నిలదీస్తుంది సుశీలమ్మ. ప్రతి విషయంలోనూ పనులు మీనాకు చెబుతున్నావ్...బాలుని వేరు చేసి చూస్తున్నావని అంటుంది. నాకు మండితే నిన్ను నీ పెళ్లాన్ని తీసుకెళ్లి ఇంట్లో పనంతా చేయిస్తాను అని హెచ్చరిస్తుంది.
నాకు నిద్రవస్తోందని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు మనోజ్. ఇవాళ ఈ రోజు వీళ్ల పెళ్లిరోజు..ఇద్దరిలో ఏ దున్నపోతు రూమ్ ఇస్తారో చెప్పండి అంటుంది. మేం ఇస్తాం అంటుంది శ్రుతి. వద్దులే డబ్బుడబ్బా చిన్న రూమ్ లో పడుకునే కన్నా పైన ఆకాశం చూస్తూ పడుకుంటాం అంటాడు.
పెళ్లిరోజు పడుకునేందుకు గది కూడా లేకుండా వాళ్లిద్దరూ మేడపై పడుకున్నారు..నాకేం నచ్చలేదంటుంది. మేం బలవంతం పెట్టలేదు అంటుంది ప్రభావతి. ఇంట్లో గదిలేనప్పుడు తప్పదు కదా అంటుంది. మేడపై గది కట్టాలి అనుకున్నాను అంటాడు సత్యం. శ్రుతివాళ్ల అమ్మ కట్టిస్తానంది కానీ మీరు ఒప్పుకోలేదు కదా అంటుంది. ఆ బుర్రకి కక్కుర్తి తప్ప ఆత్మగౌరవం ఉండదా అని గట్టిగానే ఇచ్చిపడేస్తుంది. కోపంగా వెళ్లిపోతుంది ప్రభావతి. మేడపై గదికట్టు అవసరం అయితే డబ్బు నేనిస్తాను అంటుంది. నేనెంత కూడబెట్టుకున్నా నా మనవలకోసమే కదా అని చెబుతుంది సుశీలమ్మ.