రాజ్ ఇంటికి వచ్చేసరికి అందరూ సీరియస్ గా ఉంటారు. కావ్య భర్తని వెనకేసుకొచ్చేలా మాట్లాడుతుంది. రాహుల్ నా కొడుకు వాడిని అందరి ముందు అవమానించేలా మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా అని రుద్రాణి రాజ్ ని నిలదీస్తుంది. తప్పు చేశాడు అందుకే మందలించానని చెప్తాడు. రుద్రాణి మళ్ళీ మధ్యలోకి కళ్యాణ్ ని తీసుకొచ్చి తిడుతుంది. ప్రకాశం, ధాన్యలక్ష్మి వాయించేస్తారు. ‘జల్సాలు చేసి రాహుల్ చెడిపోయాడు. ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వాడికి పెళ్లి అయ్యింది. బాధ్యతగా పని చేయాలి. బ్యాచిలర్ గా తిరుగుతానంటే కుదరదు. ఇంకా అలాగే ఉంటానని అంటే అసమర్థులకి స్వరాజ్ గ్రూపులో అడుగుపెట్టే అవకాశమే ఉండదు, తీసి పడేస్తాను. ఇంకొక విషయం కళ్యాణ్ జోలికి వెళ్తే అసలు ఊరుకోను. వాడు నాతో సమానమ’ని రుద్రాణికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.


Also Read: యష్, వేద రొమాంటిక్ డేట్- మాళవికని వాయించేసిన సులోచన


ఈ ఇంట్లో కూతురిగా స్థానం ఇచ్చాను. నీ కొడుకుని వారసుడిగా చూస్తున్నా. అది నిలుపుకోలేకపోతే వాడి ఖర్మ అని సరిపెట్టుకో. అంతే కానీ ఈ ఇంటి మనవళ్ళని ఎత్తి చూపిస్తే దుగ్గిరాల రక్తం ఊరుకోదని సీతారామయ్య తెగేసి చెప్తాడు. అదేంటి ఈ ఇంట్లో రాహుల్ కి వాళ్ళ అమ్మకి ఇంతే విలువ ఉందా? రాజ్ కి బిజినెస్ విషయాలన్నీ రాహుల్ నేర్పించానని అన్నాడు. అంతా అబద్ధమేనా? గట్టిగా మాట్లాడితే రోడ్డు మీదకి గెంటేసేలా ఉన్నారు. రాహుల్ ని నిలదీసి లాభం లేదు ముందు నేను కడుపు నిజం చేసుకోవాలని స్వప్న మనసులో అనుకుంటుంది. రాజ్ రుద్రాణి మాటల గురించి ఆలోచిస్తుంటే అపర్ణ వస్తుంది. నేను కళ్యాణ్ ని ఎలా చూస్తానో రాహుల్ ని అలాగే చూస్తాను. కానీ రాహుల్ తప్పులు చేసి దొరికిపోయాడు. వాడు తప్పు చేశాడని వదిలేయలేదు పెడదారిన పడ్డాడని మందలించాను. అందులో తప్పేముందని రాజ్ బాధపడతాడు. నువ్వు నీలాగే ఉండమని అపర్ణ సర్ది చెప్తుంది. రేపు నీ స్థానం కోరుకోడని నమ్మకం ఏంటని అడుగుతుంది. ఇంత జరిగినా కూడా అతన్ని ఎలా దగ్గరకి రానిస్తున్నావని అంటుంది. మేము ముగ్గురం కలిసి పెరిగాము. ఒక మనిషిని అభిమానించినప్పుడు తన తప్పులు కూడా క్షమించాలని చెప్తాడు. అది విని ఒక మనిషి ఇంతగా అభిమానిస్తారా? తప్పులు చేసినా కూడా ఒప్పుకుంటారా? ఎంత మంచి వాళ్ళని కావ్య మురిసిపోతుంది.


స్వప్న రాహుల్ ని ట్రాప్ లో పడేసేందుకు ఏదో పొడి తీసుకొచ్చి పాలలో కలిపి తాగించాలని అనుకుంటుంది. అది తాగితే భర్త వసమవుతాడని మూలిక ఇచ్చిన అమ్మాయి చెప్పినట్టు చూపిస్తారు. రాజ్ డల్ గా ఉండటం చూసి పాలు తీసుకొద్దామని అనుకుంటుంది. కిచెన్ లో స్వప్న కూడా పాలు కలపడం కోసం వస్తుంది. కావ్య చూడకుండా పాలలో పొడి కలుపుతుండగా ఫోన్ రావడంతో స్వప్న ఆ గ్లాసు అక్కడే పెట్టి పక్కకి వెళ్తుంది. సరిగ్గా అదే టైమ్ కి కావ్య కూడా పాలు తీసుకొచ్చి ఆ గ్లాసు పక్కనే పెడుతుంది. కాసేపటికి స్వప్న వచ్చి కావ్య కలిపిన పాలు తీసుకుని వెళ్తుంది. పొడి కలిపిన పాలు కావ్య తీసుకుని పని మనిషికి ఇచ్చి పంపిస్తుంది. స్వప్న పాలు తీసుకుని రావడం చూసి ఎలాగోకలా తప్పించుకోవాలని రాహుల్ అనుకుంటాడు. రాజ్ కావ్య పంపిన పాలు తాగేస్తాడు. అటు రాహుల్ కూడా స్వప్న తెచ్చిన పాలు తాగేస్తాడు. అవి మందు కలిపినవి అనుకుని భ్రమ పడుతూ రాహుల్ తన దగ్గరకి వస్తాడని మురిసిపోతుంది. కానీ రాహుల్ మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతాడు.


Also Read: తులసికి ఝలక్, రాజ్యలక్ష్మి ఇంట్లో పాగా వేసిన లాస్య- దివ్య జీవితం నాశనం!


అటు పొడి కలిపిన పాలు తాగి రాజ్ మైకంతో గదిలోకి వచ్చేసరికి కావ్య మల్లెపూలు పెట్టుకుంటూ ఉంటుంది. పెళ్ళాం వైపు ఓరగా చూస్తూ మీద మీదకి వెళ్లబోతు పడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. మత్తు మత్తుగా మాట్లాడతాడు. తాగేసి వచ్చారా అంటే అవును అమృతం తాగానని తిక్క తిక్కగా సమాధానాలు చెప్తాడు.