కావ్యతో ఇంట్లో ఎవరూ మాట్లాడటానికి వీల్లేదని అపర్ణ హుకుం జారీ చేస్తుంది. దీంతో అందరూ తనతో మాట్లాడేలా చేసుకోవడం కోసం కావ్య రంగంలోకి దిగుతుంది. ముందుగా రాజ్ ని లైన్లో పెట్టేస్తుంది. కళాపతి అంటూ భర్త బట్టలు దాచేసి ఆడుకుంటుంది. అలా పిలవొద్దని తనకి ఒక పేరు ఉందని వాదనకి దిగుతాడు. అలా ఫ్లోలో నేను నీ భర్తని అనేస్తాడు. దీంతో కావ్య తెగ సంతోషపడుతుంది. కిచెన్ లోకి వచ్చి చిన్నత్తని వంట చేయనివ్వకుండా ఆపి తను చేసి బుట్టలో వేసుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో ఏముందంటే..


వరలక్ష్మీ వ్రతం గురించి చర్చ జరుగుతుంది. ఇంటి ఇల్లాలు వరలక్ష్మీ వ్రతం చేసుకుని భర్త పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని అక్షింతలు వేయించుకోవాలి కదా. ప్రతి సంవత్సరం ఈ వ్రతం బాధ్యతలు నా పెద్ద కోడలు అపర్ణ తీసుకునేది. కానీ ఈ సంవత్సరం అపర్ణ కోడలు కావ్యకి బాధ్యతలు అప్పగిస్తున్నా అంటుంది. ఆ మాటకి అపర్ణ మొహం కోపంతో రగిలిపోతుంది. ఇక రాజ్ తనకి ఆఫీసులో డిజైన్స్ ఫైనలైజ్ చేసే పని ఉందని వెళ్ళనని తల్లితో చెప్తాడు. దీంతో కావ్య మొహం చిన్న బుచ్చుకుంటుంది. కావ్య వ్రతం చేసుకోవడానికి అపర్ణ ఒప్పుకుంటుందో లేదో చూడాలంటే ఈరోజు పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా వేచి చూడాల్సిందే.


Also Read: సైకోలా మారుతున్న ముకుంద - కృష్ణతో యుద్ధం మొదలు, మురారీ పరిస్థితి ఏంటి?


నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..


కావ్య వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి గంట కొట్టి అందరినీ పిలుస్తుంది. ఆ సౌండ్ కి అందరూ వచ్చేస్తారు. హోటల్ లో పెట్టినట్టు డిష్ పేర్లు చీటీ రాసి తగిలిస్తుంది. అలా ఎందుకు చేశావాని శుభాష్ కావ్యని అడుగుతాడు. తను ఏం మాట్లాడకపోవడంతో ఏంటి మౌనవ్రతం చేస్తున్నావా? అని పెద్దాయన అడుగుతాడు.


ఇంద్రాదేవి: కాదు అత్త వ్రతం చేస్తుంది. నీ భార్య కావ్యతో ఎవరూ మాట్లాడకూడదని ఇంట్లో ఆదేశాలు జారీ చేసింది. నీ కోడలిని వెలివేసింది. మా పెద్దరికానికి కూడా విలువ ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటూ ప్రవరిస్తుంది


అపర్ణ: అత్తయ్య మీకు ఆంక్షలు పెట్టడం నా తప్పే కానీ ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడ ఈ కావ్య పుట్టింటికి వెళ్ళి మట్టి పని చేయడం కరెక్ట్ అనిపిస్తుందా?


ఇంద్రాదేవి: ఏహే ఆపు నీ మట్టి గోల. తను చేస్తున్న దాంట్లో తప్పేం ఉంది


సీతారామయ్య: తను ఏ తప్పు చేయడం లేదు. ఒక కూతురిగా తను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళ అంగీకారం తీసుకుని పుట్టింటికి సాయం చేస్తుంది. తన అత్తింటి సొమ్ము తీసుకెళ్లకుండా తనకి వచ్చిన కళని నమ్ముకుని పని చేస్తుందని సర్ది చెప్పడానికి చూస్తాడు.


కానీ అపర్ణ మాత్రం కావ్య ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఇంట్లో వాళ్ళకి బేధాభిప్రాయాలు వచ్చాయని కోపంగా తినకుండా వెళ్ళిపోతుంది. ఇక కావ్య రాజ్ కి టిఫిన్ వడ్డిస్తుంటే ఒక ఇడ్లీ పెట్టించుకుని వద్దని అంటాడు. దీంతో శుభాష్ కోపంగా ఏంటమ్మా వీడు కూడా మాట్లాడటం లేదా అని అడుగుతాడు. దీంతో రాజ్ కాస్త బిక్క మొహం వేసి అదేం లేదు మాట్లాడుతున్నా అని గొణుగుతాడు. పొట్ట పెంచుకోవడం కోసం స్వప్న చేసిన ప్రయత్నం తిరగబెట్టి వాంతులు అవుతాయి. దీంతో తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని రుద్రాణి, రాహుల్ రెడీ అవుతారు.


Also Read: చిత్ర చేతిలో కన్నుమూసిన గీత - వేదకి యాక్సిడెంట్, ఇక తల్లి కాలేదా?


ఎలాగైనా హాస్పిటల్ కి వెళ్ళకుండా తప్పించుకోవాలని స్వప్న తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి మ్యానేజ్ చేయమని అడుగుతుంది. కానీ తను మాత్రం కుదరదని మోసం చేయలేనని తేల్చి చెప్పేస్తుంది. తల్లీ కొడుకులు స్వప్నని తీసుకుని హాస్పిటల్ కి వెళతారు. అక్కడ డాక్టర్ తనని చెక్ చేసి ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని స్వప్న భయంతో వణికి చస్తుంది. అటు ఇంటి దగ్గర కావ్య ఇంకా పనికి రాలేదు ఏంటా అని కృష్ణమూర్తి ఎదురుచూస్తూ ఉంటాడు. మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందేమో అని కనకం మాట్లాడుతూ ఉండగా కావ్య ఫోన్ చేస్తుంది. రాజ్ కి ఆఫీసులో సహాయం చేసేందుకు వెళ్తున్నానని రాలేనని చెప్పడంతో కృష్ణమూర్తి దంపతులు సంతోషపడతారు. రాజ్ వాళ్ళు ఆఫీసుకి బయల్దేరే టైమ్ కి స్త్రీ సంఘం నుంచి కొంతమంది మహిళలు, మీడియా దుగ్గిరాల ఇంటికి వస్తారు.


దుగ్గిరాల కుటుంబం కోడలికి ఇస్తున్న స్వేచ్చ గురించి కాసేపు పొగుడుతారు. రాజ్ మగాళ్లకి మాత్రమే కాదు అందరు మొగుళ్ళకి ఆదర్శం అందుకే సన్మానం చేయాలని వచ్చినట్టు చెప్తారు. కావ్య దొరికిందే సందు అనుకుని రాజ్, అపర్ణ గురించి తెగ పొగిడేస్తుంది.