ఒకప్పుడు బుల్లితెరపై టీవీ షోలంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలా డీసెంట్ గా ఉండేవి. ఇప్పటికీ అలాంటి కొన్ని షోలు ఉన్నాయి. కానీ ఎక్కువ షోలు మాత్రం టీఆర్పీ రేటింగ్స్ కోసం సింపుల్ ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. అదేంటంటే.. మేల్ యాంకర్, ఫిమేల్ యాంకర్ కి మధ్య ఎఫైర్ పెట్టడమే. అక్కడితో ఆగకుండా.. లవ్ ట్రాక్స్, సాంగ్స్, డాన్స్ లు, డబుల్ మీనింగ్ డైలాగులు, లవ్ ప్రపోజల్స్ ఒకటా రెండా..? అన్ని రకాలుగా ఎపిసోడ్స్ చిత్రీకరించి ఫైనల్ గా ఫేక్ పెళ్లితో ముడి వేసేస్తున్నారు. ఈ వీడియోలు యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఈ రేంజ్ లో వ్యూస్ ను తెప్పించడంల కీలకపాత్ర పోషిస్తోన్న ఆ మేల్ అండ్ ఫిమేల్ యాంకర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం!



సుడిగాలి సుధీర్ - రష్మీ:
'జబర్దస్త్' షో మొదలై ఇప్పటికి ఎనిమిదేళ్లు దాటేసింది. అప్పటినుండి కూడా బుల్లితెరపై ఇది నెంబర్ వన్ టీవీ షోగా దూసుకుపోతుంది. దీనికి పోటీగా ఎన్ని కామెడీ షోలు వచ్చినా కూడా దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి. ఇక ఈ షోలో సుడిగాలి సుధీర్-రష్మీలు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఈ షోతో పాటు 'ఢీ' షోలో కూడా వీరిద్దరూ కలిసి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండిస్తుంటారు. రష్మీ కోసం సుధీర్ పాటలు పాడడం, ఇద్దరూ కలిసి రొమాంటిక్ పాటలకు పెర్ఫార్మ్ చేయడం చూస్తూనే ఉన్నాం. మొన్నామధ్య ఈ జంటకి మల్లెమాల సంస్థ పెళ్లి కూడా జరిపించేసింది. ఈ జంటకు సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు. వీరి పేర్లపై కొన్ని సోషల్ మీడియా పేజీలను కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇక రష్మీతో పాటు సుధీర్ కి యాంకర్ వర్షిణి, విష్ణుప్రియలతో కూడా ఎఫైర్స్ ఉన్నట్లు చూపించారు. విష్ణుప్రియతో కలిసి 'పోవే పోరా' షో చేశాడు సుధీర్. ఆ సమయంలో ఈ జంట చేసే రచ్చ మాములుగా ఉండేది కాదు. 



రవి - లాస్య : 
కొన్నేళ్ల క్రితం రవి-లాస్య కలిసి 'సమ్ థింగ్ స్పెషల్' అనే టీవీ షో చేశారు. అప్పటినుండే వీరిద్దరి రిలేషన్ గురించి రకరకాల వార్తలు వినిపించేవి. అయితే కొన్నాళ్లకు వీరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరూ కలిసి పని చేయడం మానేశారు. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న లాస్య మళ్లీ బుల్లితెరపై బిజీ అయింది. ఈ క్రమంలో రవితో కలిసి షోలు చేయడం మొదలుపెట్టింది. ఇక రవి 'కామెడీ స్టార్స్' షోలో లాస్యని ఉద్దేశిస్తూ డబుల్ మీనింగ్ డైలాగులు వేయడం, ఆమె చుట్టూ తిరగడం చూస్తూనే ఉన్నాం. 



హైపర్ ఆది - అనసూయ : 
'జబర్దస్త్' షోలో హైపర్ ఆది స్పెషల్ గా అనసూయను ఉద్దేశిస్తూ కొన్ని పంచ్ లు రాసుకుంటూ ఉంటాడు. ఆ పంచ్ లు పడే ప్రతిసారి అనసూయ ఓర కంటతో చూడడం.. దానికి హైపర్ ఆది సిగ్గుపడడం.. వామ్మో ఈ రచ్చ మాములుగా ఉండదుగా. ఇక రీసెంట్ గా హైపర్ ఆదికి మరో యాంకర్ దీపికా పిల్లితో లింక్ పెడుతూ స్కిట్ లు డిజైన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ షోలో వీరిద్దరూ కలిసి పెళ్లి గెటప్ లో కనిపించారు. 



ప్రదీప్ - శ్రీముఖి : 
పాపం వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ పెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు టీవీ షో నిర్వాహకులు. కానీ వీరి మధ్య కెమిస్ట్రీ మాత్రం వర్కవుట్ అవ్వడం లేదు. మొన్నామధ్య శ్రీముఖి ఏకంగా స్టేజ్ పైనే ప్రదీప్ కి 'ఐ లవ్యూ' చెప్పేసింది. దానికి మనోడు చాలా సిగ్గు పడిపోయాడు. ఎన్ని చేసినా.. ఈ జంటను మాత్రం ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. 



ఇమ్మాన్యుయేల్ - వర్ష :
బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉండే ఈ జంటకి యూట్యూబ్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. చాలా ఎపిసోడ్ లో వర్ష.. ఇమ్మాన్యుయేల్ పై తన ప్రేమను చాటుతూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. తనకు ఇమ్మాన్యుయేల్ తోడుగా ఉంటాడంటూ మొన్నామధ్య ఎమోషనల్ అయిపోయింది. ఇక ఈ జంటకు మల్లెమాల యాజమాన్యం పెళ్లి కూడా చేసేసింది. ఇదేదో నిజమైన పెళ్లి మాదిరి సోషల్ మీడియాలో వర్ష చేసిన హడావిడికి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. 



హరి - అషురెడ్డి : 
ఈ మధ్యకాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన జంట హరి-అషురెడ్డి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని వర్కవుట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా హరి ఏకంగా తన గుండెలపై అషురెడ్డి పేరుని టాటూగా వేయించుకొని షాకిచ్చాడు.