దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సింది. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారు. ముంబై, కర్ణాటక, చెన్నై, హైదరాబాద్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రమోషన్స్ నిర్వహించారు. కానీ సినిమా వాయిదా పడడం వలన  ఆ కష్టమంతా వృధా అయింది. ఈసారి కూడా ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నుంచి 'ఎత్తర జెండా' అనే సెలబ్రేషన్ ఆంథెమ్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 


దీనికి సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్‌ను, పాట ప్రోమోను వదిలారు. పూర్తి పాటను ఈరోజు సాయంత్రం 4గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. కానీ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సాంగ్ ను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్లు ఉన్నారు. రాజమౌళి అండ్ 'ఆర్ఆర్ఆర్' టీమ్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వెళ్లిన రాజమౌళిని ఉద్దేశిస్తూ.. తిరగడానికి టైం ఉంది కానీ పాటను మాత్రం సరైన టైంకి రిలీజ్ చేయరంటూ మండిపడుతున్నారు. 


మరికొందరైతే బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకోవద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇక ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ ముగ్గురూ కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.