'భీమ్లానాయక్' సినిమాకి సంబంధించిన త్రివిక్రమ్ ఎక్కడా మాట్లాడకపోవడం హాట్ టాపిక్ అయింది. పవన్ సినిమా ఈవెంట్ అంటే తనకు సంబంధం ఉన్నా.. లేకపోయినా.. త్రివిక్రమ్ వాలిపోతారు. తన స్పీచ్ తో పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటారు. అలాంటిది 'భీమ్లానాయక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ కనిపించలేదు. 


ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా ప్రచారాలు జరిగాయి. దర్శకుడు సాగర్ ని డామినేట్ చేస్తున్నారనే విమర్శలకి చెక్ పెట్టడానికే త్రివిక్రమ్ దూరంగా ఉన్నారని మాటలు వినిపించాయి. తాజాగా 'భీమ్లానాయక్' సక్సెస్ మీట్ లో పాల్గొన్న త్రివిక్రమ్ ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ముందుగా మీడియాకి థాంక్స్ చెప్పిన త్రివిక్రమ్.. అందరికీ పాదాభివందనాలు అంటూ తన స్పీచ్ ని మొదలుపెట్టారు. 


ఆయన మాట్లాడుతూ.. 'అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాను రీమేక్ చేస్తున్నామంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది రీమేక్ లా అనిపించకూడదు. ఆ సినిమాలో కథ మొత్తం కోషి నుంచి చెప్పారు. దానిని తెలుగులో 'భీమ్లానాయక్' వైపు ఎలా తిప్పాలి..? ఎలా తీసుకురావాలని ఎక్కువగా ఆలోచించాం. భీమ్లానాయక్ పాత్రను అడవికి దగ్గరగా తీసుకొని వెళ్తే.. అతడి క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ దొరుకుతుందనిపించింది. ఒరిజినల్ నుంచి బయటకి రావడానికి మేము చేసిన ప్రయత్నమేమిటంటే.. స్క్రీన్ పై భీమ్లా అయినా ఉండాలి.. లేదంటే డ్యానీ అయినా ఉండాలి. కాదు అంటే ఇద్దరూ ఉండాలి. అందుకే చివరికొచ్చేసరికి ఇద్దరినీ అలా చూపించాం. భీమ్లా వైఫ్ గొడవ చేయమంటుంది.. డ్యానీ వైఫ్ రాజీ పడమంటుంది. ప్రతి సీన్ కి కౌంటర్ ఉండేలా చేశాం. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం చాలా టఫ్ జాబ్. దర్శకుడు సాగర్ ఏమైనా ఇబ్బందిపడతాడేమోననే ఉద్దేశంతో నేను ఉన్నప్పుడు నేను, చినబాబు గారు ఉన్నప్పుడు ఆయన.. లేదంటే నాగవంశీ.. ఇలా పవన్ కళ్యాణ్ గారితో కమ్యూనికేషన్ కోసం మేము బ్రిడ్జ్ లా పని చేశాం' అంటూ క్లారిటీ ఇచ్చారు త్రివిక్రమ్. ఈ స్పీచ్ తో దర్శకత్వంలో తన ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పే ప్రయత్నం చేశారు త్రివిక్రమ్.