Sajjanar Thanks To S Thaman : దివ్యాంగ సింగర్ కు ఓ అవకాశం కల్పించాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్పందించారు. ఆ యువకుడికి అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.  తెలుగు ఐడియల్ సీజన్ 4లో ఆయన పాల్గొనేలా చూడాలని ఆహా టీమ్ ను కోరారు. ఆహా వేదిక మీద అతడితో కలిసి ప్రదర్శన ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు.


“అతడు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో కచ్చితంగా ప్రదర్శన ఇస్తాడు. ఆహా టీమ్.. ఇదినా రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఆర్డర్ అనుకోండి. అతడికి అవకాశం కల్పించండి. నేను ఆహా వేదికపై అతడితో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను. అతడిలో చక్కటి టాలెంట్ ఉంది. పర్ఫెక్ట్ పించింగ్ లో పాడుతున్నాడు. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు. కానీ, మనం మనుషులం. ఆయన మర్చిపోలేని అనుభవాన్ని అందించాలి. అందుకే మేం సిద్ధంగా ఉన్నాం” అని రాసుకొచ్చారు. తమన్ ప్రకటన పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మట్టిలో మాణిక్యానికి అవకాశం కల్పించడం నిజంగా గొప్పవిషయం అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.






తమన్‌ కు సజ్జనార్‌ థ్యాంక్స్


దివ్యాంగ యువకుడికి అవకాశం కల్పిస్తున్నట్లు తమన్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ తమన్ సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. “అద్భుత‌మైన కంఠంతో పాట‌లు ఆల‌పిస్తోన్న ఈ అంధ యువ‌కుడికి తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌లో అవ‌కాశం ఇచ్చేలా చూస్తాన‌ని ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు తమన్‌ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ అవ‌కాశంతో అద్భుత‌మైన త‌న టాలెంట్‌కు మ‌రింత‌గా గుర్తింపు ద‌క్కుతుంది. భవిష్యత్‌లో త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దుల‌ను చేస్తూ ఈ యువకుడు ఉన్న‌తంగా ఎదుగుతార‌ని ఆశిస్తున్నాను” అని రాసుకొచ్చారు.  






సోషల్ మీడియా వేదికగా వీడియో షేర్ చేసిన సజ్జనార్     


రీసెంట్ గా ఓ దివ్యాంగ యువకుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ చక్కగా పాటలు పాడారు. ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలోని ‘రామ రామ రఘురామ’ అంటూ అద్భుతంగా ఆలపించారు. అతని పాటను విన్న ప్రయాణికులు చప్పట్లతో  అభినందించారు. ఆయన వాయిస్ కు అందరూ ఫిదా అయ్యారు. పలువురు అతడి వీడియోను తీసి పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొద్ది సేపట్లోనే బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన, ఈ వీడియోను తన ఎక్స్ అకౌంట్ వేదికగా షేర్ చేశారు. ఆ దివ్యాంగ సింగర్ పై ప్రశంసలు కురిపించారు. అతడికి ఓ అవకాశం కల్పించాని ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి రిక్వెస్ట్ చేశారు. “మనం చూడాలే కానీ, ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా! ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్” అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తమన్ స్పందించారు. ఆయనకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు.



Read Also: సన్నీ డియోల్ మూవీలో ‘మసూద‘ బ్యూటీ, తెలుగమ్మాయి దశ తిరిగినట్టేనా?