ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎటు చూసినా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల గురించే  చర్చలు జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు ఇలా చాలా మంది బరిలో నిలిచారు. దీంతో ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. పోలింగ్ జరగడానికి మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుండే ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. 



కొన్ని రోజుల క్రితం ప్రకాష్ రాజ్ తన మద్దతు దారులతో కలిసి ప్రెస్ మీట్ ను నిర్వహించి తన ఎజండాను బయటపెట్టారు. తాజాగా మంచు విష్ణు ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో కొందరు పెద్దలు తనను నిలబడమని చెప్పడం వలనే బరిలోకి దిగానని.. తనకు చెప్పినప్పుడు రేసులో మరెవరూ లేరని అన్నారు. దాని తరువాత ఎన్నో అవకతవకలు జరిగాయని.. అవన్నీ ఇప్పుడు చెప్పనని.. కుటుంబంలో జరిగే విషయాలను బయటపెడితే మంచిది కాదని అన్నారు.  
'మా' బిల్డింగ్ ఒక్కటే తన ఎజెండా కాదని.. ఇక్కడ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించడం కూడా తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. 'మా' బిల్డింగ్ కోసం సాయం చేయడానికి ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు మంచు విష్ణు. 



కరోనా వచ్చిన సమయంలో ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు నరేష్ సినిమా కార్మికులకు ఎంతో సాయం చేశారని విష్ణు చెప్పుకొచ్చారు. కష్ట సమయంలో సహాయం చేయడం చాలా గొప్ప విషయమని.. కానీ దాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రజలకు సేవలు చేస్తున్నారని.. ఇప్పటికే తను పదిహేను గ్రామాలు దత్తత తీసుకొని వాటి బాగోగులు చూసుకుంటున్నానని.. మహేష్ బాబు లాంటి స్టార్స్ కూడా అలాంటి సేవలు చేస్తున్నారని అన్నారు. 



బయటకు చెప్పకుండా సాయం చేసేవాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని చెప్పారు. ఎవరైనా ఎదుటివాళ్లకు ఆదర్శంగా ఉండాలని.. మనల్ని నమ్ముకున్న వాళ్లకు ఎలా అండగా ఉండాలనేదే తన ఎజెండా అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇండస్ట్రీ జనాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తను చేసిన సాయం వలనే జైల్లో ఊసలు లెక్కబెట్టాల్సిన చాలా మంది బయట తిరుగుతున్నారని మంచు విష్ణు స్పష్టం చేశారు. 



ఇండస్ట్రీలో ఎంతమందికి సాయం చేశాననే విషయాన్ని చెప్పనని.. కొంతమంది ఊసలు లెక్కపెట్టకుండా ఉన్నారంటే ఎవరివల్లా అనే ప్రశ్న వాళ్లనే అడగాలని చెప్పారు. అండర్‌వేర్లతో పోలీస్ స్టేషన్‌లో కూర్చొబెడితే.. తెల్లారి 4.30 గంటలకు వెళ్లి సర్ది చెప్పి బయటకు తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. వాళ్లు కనుక శ్రుతి మించి మాట్లాడితే తప్పకుండా అలాంటి వాళ్ల పేర్లు బయటపెడతానంటూ విష్ణు హెచ్చరించారు. విష్ణు సాయం పొందిన ఆ సెలబ్రిటీలు ఎవరు..? వాళ్లు ఇప్పుడు ఏ ప్యానెల్ లో ఉన్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.