సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాదు, అవసరం అయితే, సామాజిక ప్రయోజనాలు కాపాడుకునేందుకు ముందుంటాం అంటున్నారు పలువురు సినీ తారలు. పర్యవరణ పరిరక్షణ కోసం ఎంత వరకైనా పోరాడుతామని తేల్చి చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్ గూడలో దేశంలోనే అతిపెద్ద ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని పలువురు టాలీవుడ్ స్టార్స్ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ ప‌ర్యావ‌ర‌ణానికి అతి పెద్ద సవాల్ గా మారబోతుందని సినీ న‌టులు రేణూ దేశాయ్, శ్రీదివ్య , ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్కాతో పాటు మ‌రికొంద‌రు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఎలాంటి ప‌ర్యావ‌ర‌ణ అధ్య‌య‌నం లేకుండా చేప‌ట్టిన ఈ అక్వా మెరైన్ పార్క్ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలంటూ హైకోర్టులో ప్ర‌జా ప్రయోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు.


తెలంగాణ ప్ర‌భుత్వానికి, HMDAకు హైకోర్టు నోటీసులు


హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భుయాన్, జ‌స్టిస్ తుకారంజీ ఆధ్వ‌ర్యంలో ఈ కేసు విచార‌ణ జరిగింది.  సింగ‌పూర్, మ‌లేసియా సహా పలు దేశాల్లో ఆక్వా మెరైన్ పార్కులు ఏర్పాటు అయ్యాయని, మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని పిటీషనర్లను న్యాయస్థానం ప్రశ్నించింది. పిటీష‌న‌ర్ల త‌రపున న్యాయ‌వాది శ్రీర‌మ్య వాద‌న‌లు వినిపిస్తూ, ఎటువంటి ప‌ర్యావ‌ర‌ణ అధ్య‌య‌నం లేకుండా ఏర్పాటు చేయబోతున్న ఈ పార్కులతో జ‌ల‌చ‌రాల‌కు, వ‌న్య ప్రాణుల‌కు మున్ముందు తీవ్ర నష్టం కలుగుతుందని వెల్లడించింది. ఈ వాదనలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ధ‌ర్మాస‌నం  ప్ర‌భుత్వానికి, HMDAకు నోటీసులు జారీ చేసింది.


ఆక్వా మైరైన్ పార్కులతో ప‌ర్యావ‌ర‌ణానికి పెను ముప్పు- ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్కా


ప‌ర్యావ‌ర‌ణానికి ఆక్వా మైరైన్ పార్కులతో చాలా ఇబ్బందులు కలుగుతాయని ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్కా వెల్లడించారు.  వేలాది జ‌ల‌చ‌రాల మ‌నుగ‌డ కు ముప్పు కలుగుతుందన్నారు. ఆహ్లాదం కోసం మ‌న‌ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో చాలా జీవులు చ‌నిపోతాయన్నారు. కృత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో వాటి జీవ‌నం అత్యంత బాధాక‌రంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల గ్యాల‌న్ల నీటితో న‌డిచే ఈ ఆక్వా పార్క్ లు నీటి స‌మ‌స్య‌కు కూడా కార‌ణం అవుతాయన్నారు. ఇలాంటి పార్క్ ల నిర్మాణాలను  చాలా దేశాలు వ్య‌తిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి ప్రజలు, పర్యావరణవేత్తలు మద్దుతు ఇవ్వాలని శ‌శికిర‌ణ్ విజ్ఞప్తి చేశారు.      


పర్యావరణంపై అవ‌గాహన పెంచే పార్కులను ఏర్పాటు చేయండి- సదా


పర్యావరణానికి హాని కలిగించే పార్కులను కాకుండా, పర్యావరణం మీద ప్రజలకు అవగాహన కలిగించే పార్కులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సదా సూచించింది. “ఇప్ప‌టికే హైదరాబాద్ న‌గ‌రంలో నీటి స‌మ‌స్య  ఉంది.  మూడు వేల గ్యాల‌న్ల నీటితో నిర్మాణం అయ్యే ఇలాంటి ఆక్వా పార్కులు ఆ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.  స‌హజంగా స‌ముద్రాల‌లో పెరిగే  జ‌ల‌చ‌రాలును తీసుకొచ్చి, క‌త్రిమంగా నిర్మాణం అయ్యే ఇలాంటి పార్క్ ల‌లో ఉంచ‌డం వల్ల వాటి ప్రాణాల‌కే ప్ర‌మాదం కలుగుతుంది.ఇలాంటి పార్కులు కాకుండా ఎన్విరాన్ మెంట్ పై అవ‌గాహన పెంచే పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది” అని వెల్లడించింది.


Read Also: 'దొంగోడే దొరగాడు'- మోసగాళ్లను ఆటాడేసుకుంటున్న'బెదురులంక 2012' కొత్త పాట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial