'RX 100' కార్తికేయ హీరోగా, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బెదురులంక 2012'. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బెన్నీ నిర్మించారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'వెన్నెల్లో ఆడపిల్ల...', 'సొల్లుడా శివ...' పాటలను విడుదల చేశారు.  ఆడియెన్స్ నుంచి ఈ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూడో పాట 'దొంగోడే దొరగాడే'ను మేకర్స్ విడుదల చేశారు. 


ఆకట్టుకుంటున్న 'దొంగోడే దొరగాడే' సాంగ్


‘లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడికాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే’  అంటూ సాగే ఈ పాటను మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరపరిచారు. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించారు. సాహితి చాగంటి అద్భుతంగా ఆలపించారు. ప్రతి ఊరిలో, ప్రతి ప్రాంతంతో మతం పేరుతో దోచుకునే మోసగాళ్లు ఉన్నారని ఈ పాటలో చెప్పారు మేకర్స్. ప్రధానంగా పల్లెటూర్లలో మూఢ నమ్మకాల పేరుతో ఏం జరుగుతుందో చూపించినట్లు లిరికల్ సాంగ్ చూస్తుంటే అర్థం అవుతోంది. 



ప్రజల్లో ఈ పాట ఆలోచన కలిగిస్తుంది- క్లాక్స్


ఈ పాట విడుదల నేపథ్యంలో దర్శకుడు క్లాక్స్ స్పందించారు. ''ఒక ఊరి ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని, వాళ్ళకు దేవుని మీద ఉన్న భక్తిని కొంత మంది కేటుగాళ్లు గమనిస్తారు. మూఢ నమ్మకాల పేరుతో వారిని ఎలా దోచుకుంటారు? అనే విషయాన్ని ఈ పాటలో చూపించాం. ప్రేక్షకులకు వినోదం కలిగించడంతో పాటు వారిలో ఓ ఆలోచనను ఈ పాట కలిగిస్తుందని భావిస్తున్నాం” అని చెప్పారు. 


గోదావరి నేపథ్యంలో వస్తున్న డిఫరెంట్ మూవీ- బెన్నీ


సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని తెలిపారు. '' ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  ఈ సినిమాకు  మణిశర్మ అద్భుతమైన బాణీలు అందించారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందింది. గోదావరి నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పూర్తి అయ్యింది'' అని చెప్పారు .  


ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


Read Also: ‘చికుబుకు చికుబుకు రైలే’ పాట వెనుక అంత కథ ఉందా? అది రెహమాన్ ప్లాన్ కాదా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial