సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఒకటేమిటి సినీ పరిశ్రమలోని అన్ని క్రాఫ్ట్స్ పై అవగాహన కలిగి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన తన తండ్రి చనిపోవడానికి కారణం చెప్తూ కంటతడి పెట్టారు.


తండ్రి గురించి చెప్తూ కంటతడి పెట్టిన పోసాని


తరుచుగా టీవీ షోలలో పాల్గొనే పోసాని మురళి కృష్ణ, తాజాగా యాంకర్ సుమ షోకు గెస్టుగా హాజరయ్యారు. కమెడియన్ అలీతో కలిసి ఆయన ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ కు సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామిలీ ముచ్చట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో యాంకర్ సుమ ఆయన తండ్రి గురించి అడుగుతుంది. ఈ సందర్భంగా పోసాని తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనలయ్యారు. ఎలాంటి చెడు అలవాటు లేని తన తండ్రికి ఎవరో పేకాట నేర్పించారని, ఆ పేకాటే తన తండ్రి ప్రాణాలను తీసిందని చెప్పుకొచ్చారు. “మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. తనకు ఎలాంటి చెడ్డ అలవాటు లేదు. కానీ, ఎవడో తనకు పేకాట ఆడటం నేర్పించాడు.  నాన్న పేకాట ఆడటం చూసి ఊళ్లోవాళ్లు అడిగేవారు. ఎందుకు సుబ్బారావు.. ఇలా చేస్తున్నావు? అని విమర్శించే వారు. ఆ విమర్శలు తట్టుకోలేకపోయారు. ఇంటి దగ్గరి నుంచి పొలం దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగారు. అక్కడిక్కడే ఆయన చనిపోయారు” అంటూ పోసాని కంటతడి పెట్టారు.


ఇప్పటికీ చిన్న ఫోన్ వాడుతున్నా- పోసాని


ఈ షోలో పోసాని తన మోబైల్ ఫోన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఇప్పటి వరకు తాను స్మార్ట్ ఫోన్ వాడలేదన్నారు. చిన్న ఫోన్ మాత్రమే వాడుతున్నట్లు వెల్లడించారు. అంటే మీ ఫోన్ లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్ స్టా గ్రామ్ ఉండవా? అని సుమ ప్రశ్నిస్తే, అవి ఎందుకు? అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో షోలో నవ్వుల పువ్వులు పూశాయి. అటు పోసాని ఊతపదం ‘రాజా’పై సుమ ఫన్నీగా స్పందించింది. రాజా, రాజా అని మీరు అన్నట్లు తాను ఇంత వరకు మా ‘రాజా’ను కూడా పిలవలేదు అంటూ రాజీవ్ కనకాల గురించి చెప్పుకొచ్చింది.


ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పోసాని


అటు ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. కొద్ది రోజు కిందటే ఏపీ సీఎం జగన్ ఆయనకు ఈ పదవిలో నియమించింది. గత ఎన్నికల్లో పోసాని వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి జగన్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం ఆయనకు ఈ పదవిని అందించింది. అటు ఈ సందర్భంగా  కమెడియన్ అలీ కూడా తన సినీ కెరీర్, ఫ్యామిలీ గురించి పలు విషయాలు వెల్లడించారు. త్వరలో ఈ షో బుల్లితెరపై ప్రసారం కానుంది.  


Read Also: ‘బాహుబలి’ బాటలో ‘ప్రాజెక్ట్-K’, రెండు పార్టులుగా విడుదల కాబోతోందా?