కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. గతేడాది మూతపడిన ఈ థియేటర్లు ఈ ఏడాది ఆరంభంలో తెరుచుకున్నప్పటికీ.. మళ్లీ సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డాయి. అలా మూతపడిన థియేటర్లు ఇప్పటివరకు తెరుచుకోలేదు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చినా.. టికెట్ రేట్ల గొడవ తేలకపోవడంతో ఇంకా థియేటర్లు ఓపెన్ చేయలేని పరిస్థితి. 

 

అయితే ఈ టికెట్ రేట్ల వ్యవహారంపై ఇప్పటివరకు ఏ హీరో కూడా మాట్లాడలేదు. ఇదంతా ఓ ప్రభుత్వంతో వ్యవహారం కావడంతో ఎవవరో కూడా బయటకు మాట్లాడడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తన అభిప్రాయాలను బయటపెట్టాడు హీరో నాని. తాజాగా జరిగిన 'తిమ్మరుసు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు నాని. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడడం, ఇంతకీ తెరుచుకోకపోవడంపై తన ఆవేదనను వ్యక్తం చేశాడు ఈ కుర్ర హీరో. 

 

విదేశాల్లో వీకెండ్ వస్తే అమ్మ, నాన్నను లేదా స్నేహితులను చూడడానికి వెళ్తారు కానీ మన దేశంలో అమ్మ, నాన్నలను లేదా స్నేహితులను తీసుకొని సినిమాకు వెళ్తామని అది మన అలవాటు అని నాని చెప్పుకొచ్చాడు. కరోనా లేదా ఇలాంటి పాండమిక్ సిట్యుయేషన్ లో థియేటర్లు మూసి వేయడం మంచిదే అని కానీ సమస్య ఏంటంటే.. అందరికన్నా ముందుగా మూతపడేవి థియేటర్లు, ఆఖరున తెరుచుకునేవి థియేటర్లు అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. 

 

థియేటర్ల కన్నా ముందుగా తెరచుకున్న అనేకానేక వ్యవస్థల దగ్గర జనం ఎలా వుంటున్నారో ఓసారి గమనించాలని చెప్పాడు. నిజానికి బార్లు, రెస్టారెంట్ల కంటే థియేట‌ర్లే సేఫ్ అని.. అయినా స‌రే, థియేట‌ర్ల‌ని, సినిమాని చిన్న చూపు చూస్తున్నార‌ని అన్నాడు. తన 'టక్ జగదీష్' సినిమా రిలీజ్ కు ఉందని.. ఇలా మాట్లాడడం లేదని.. సినిమా అంటే హీరోలు, నిర్మాతలే కాదని.. థియేటర్ వ్యవస్థ అనే పెద్ద వ్యవస్థ ఉందని మర్చిపోతున్నామని చెప్పుకొచ్చాడు. 

 

ఈ మధ్యకాలంలో ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు అపరిమితంగా పెరిగిపోతున్నాయని.. కానీ సినిమా టికెట్ ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం అనేక నిబంధనలు అడ్డం పడుతున్నాయని చెప్పాడు. పైగా టికెట్ రేట్ల సమస్య పరిష్కారం అత్యవసర సమస్య కాదని అంటున్నారని.. అది కరెక్ట్ కాదని నాని తన అభిప్రాయాన్ని బయటకు చెప్పాడు. థియేటర్ల సిబ్బందికి మాత్రం ఇది అత్యవసరంగా పరీక్షకారాం కావాల్సిన సమస్యే అని అన్నాడు.