చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువ. మరి, మెగాస్టార్ తన అభిమానులకు మెప్పించే చిత్రాలను చేస్తున్నారా? తన స్థాయికి తగిన కథలను ఎంచుకోవడంలో తడబడుతున్నారా? రీమేక్ చిత్రాలతో సేఫ్ జర్నీ చేయాలని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క పోవచ్చు. అయితే, మెగా ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలంటే.. తప్పకుండా ఈ అభిమాని ట్వీట్ చదవాల్సిందే.


చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ‘ఖైదీ నెం.150’ అనే రీమేక్ చిత్రంతో ప్రారంభించడం అభిమానులకు కాస్త కష్టంగానే అనిపించింది. అయితే, ఆయన మెగాస్టార్.. ఏం చేసినా ఆలోచించే చేస్తారు. ఆయన మళ్లీ సినిమాల్లోకి వచ్చి అలరిస్తే చాలని అభిమానులు అనుకోవడంలో తప్పులేదు. కానీ, ఆయన రీమేక్ చిత్రాలు చేయాలని మాత్రం ఎవరూ కోరుకోరు. ఎవరో హీరో చేసిన పాత్రను మళ్లీ మెగాస్టార్ చేయడం ఏమిటనే.. ప్రశ్న వారి మదిలో మెదులుతుంది. ఎందుకంటే.. చిరంజీవి అంటే ఓ ‘రుద్రవీణ’.. చిరంజీవి అంటే ఓ ‘చంటబ్బాయ్’.. చిరంజీవి అంటే.. ఓ ‘గ్యాంగ్ లీడర్’. ఇంకా ఆయన తన మార్క్ నటనతో మరెన్నో చిత్రాలతో అలరించిన గొప్ప నటుడు.


అయితే, ఇప్పుడు చిరంజీవి చేస్తున్న చిత్రాలు అభిమానులను మెప్పించడం లేదా? ప్రస్తుతం షూటింగ్‌కు సిద్ధమైన ఐదు చిత్రాల్లో రెండు రీమేక్ సినిమాలే. మలయాళం హిట్ కొట్టిన ‘లూసిఫర్’ను ‘గాడ్ ఫాదర్’గా, తమిళంలో అజీత్ కుమార్ నటించిన ‘వెదలం’ సినిమాను ‘భోళా శంకర్’గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సాయి పల్లవి ‘‘నేను రీమేక్ చిత్రాల్లో చేయను’’ అనే మాటలు కూడా చిరంజీవిని కాస్త నొప్పించినట్లుగానే అనిపిస్తున్నాయి. మరి, దీనిపై అభిమానులు ఏమనుకుంటున్నారో తెలియాలంటే.. ఆనంద సంగీతమ్ అనే ఓ అభిమాని చిరంజీవికి రాసిన లేఖను చదవాల్సిందే. 


ఆ లేఖలో ఏం ఉందంటే..: ‘‘చిరంజీవి గారు.. ఒక సినిమాలో ఆ తార కాకుండా ఆ పాత్ర కనిపించినప్పుడే అది అసలైన నటన. కన్యాశుల్కంలో ఎన్టీఆర్ కనిపించడు. గిరీశం మాత్రమే కనిపిస్తాడు. చంటబ్బాయిలో చిరంజీవి కనిపించడు. పాండురంగా రావు మాత్రమే ఉంటాడు. నాకు ఆ చిరంజీవి కావాలి. ఆ రుద్రవీణ సూర్యం కావాలి. ఆ గ్యాంగ్ లీడర్ రాజారాం కావాలి. ఆ ‘ఖైదీ నెం.150’, ‘సైరా’, ‘లూసిఫర్’ వద్దు. తెలుగు వాళ్లకు సినిమా పిచ్చి సార్. లూసిఫర్ మేము ఎప్పుడో చూసేశాం. అయినా మోహన్ లాల్ మనోడే. పృథ్వీరాజ్ మనోడే.. మళ్లీ అదే కథ మీతో చూసి ఏం చేయమంటారు?’’


‘‘అయినా రే మేకులే తప్ప మన దగ్గర కథలు లేవా? కథనాలు లేవా? మీరు ఏదో మాటవరసకి ‘అర్థాకలి’ అంటూ ఉంటారు గానీ.. మీకు ఆకలే లేదు. ఆ సూర్యం పాత్రలో ‘నేను సైతం’ అంటూ బయటకొచ్చే నటుడు నాకు కనిపించట్లేదు. ‘ఖైదీ నెంబర్ 150కి మీరెందుకు సార్? మీ రేంజ్ ఏంటీ మీరు చేసే కథలేంటి? ఇంకెన్ని రోజులండి ఈ కథలు రాయడం రాని కథకులతో. వీళ్లు సీన్లు తీయడంలో సినిమాని మర్చిపోయారు. మీరు పస్తు ఉండండి కొన్ని రోజులు. చిరంజీవి కనిపించకుండా నటించండి. అది చూడాలని ఉంది. తప్పుగా భావించకండి. మీకు అద్దం చూపించాలి మరి’’ అంటూ ట్వీట్ చేశాడు. 


Also Read: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే


అయితే, ఈ ట్వీట్‌పై చిరు నుంచి రిప్లయ్ రాలేదు. కానీ, ఆయన అభిమానులు మాత్రం స్పందిస్తున్నారు. ఈ ట్వీట్‌ను 200 మందికి పైగా రీట్వీట్ చేసుకోవడం గమనార్హం. అయితే, ఇందులో చిరంజీవి తప్పులేదని, సరైన రచయితలే లేరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పెద్ద హీరోలకు తగినట్లుగా కథలు రాసే రచయితలు లేకపోవడం వల్లే రీమేక్‌ల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు. కొందరు తమకు కూడా అదే అభిప్రాయం ఉందని తెలుపుతున్నారు. ఈ విషయం చిరంజీవి తెలుసుకుంటే బాగుంటుందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే, ‘సైరా’ చిత్రాన్ని ఆ జాబితాలో చేర్చడం తమకు నచ్చలేదని, అది ఓ మహనీయుడి గురించి తీసిన చిత్రమని.. ఆ చిత్రానికి చిరంజీవి పనిచేయడం గర్వకారణమని మరికొందరు తెలుపుతున్నారు. మరి, ఈ ట్వీట్‌పై చిరంజీవి స్పందిస్తారో లేదో చూడాలి. 



గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలన్నీ.. కేవలం సోషల్ మీడియాలో వ్యక్తుల అభిప్రాయం మాత్రమే. వాటిని ఇక్కడ యథావిధిగా అందించాం. వారి వాఖ్యలకు ‘ఏబీపీ దేశం’ బాధ్యత వహించదని గమనించగలరు. 


Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్, సామ్‌కు ఏమైంది?


Also Read: ప్రభుత్వం ఆధీనంలో సినిమా టికెట్లు.. లాభం ఎవరికీ? ఇక బెనిఫిట్ షోలు ఉండవా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి