మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. చిరు, నాగార్జున మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇద్దరూ సీనియర్ హీరోలే. అయితే ఇప్పుడు వీరిద్దరూ పోటీ పడడానికి రెడీ అవ్వడం చర్చకు దారి తీసింది. 


ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలకు టైం అంత బాలేదు. ఒక్కరికి కూడా సరైన హిట్టు పడడం లేదు. బాలయ్య 'అఖండ' తప్పించి.. సీనియర్ హీరోల సినిమాలు పెద్దగా ఆడింది లేదు. చిరు 'ఆచార్య', నాగార్జున 'వైల్డ్ డాగ్' సినిమాలు ఎంత పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయో తెలిసిందే. ఇలాంటి సమయంలో వీరిద్దరూ పోటీ పడడం అనేది ఆలోచించాల్సిన విషయమే. 


నిజానికి ఇంటర్నల్ గా జరిగిన డిస్కషన్స్ లో నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాను దసరా డేట్ కంటే వారం ముందు విడుదల చేసేలా ప్లాన్ చేశారట. దాంతో మెగాస్టార్ తన 'గాడ్ ఫాదర్' సినిమాకి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇంతలో 'ది ఘోస్ట్' సినిమా డేట్ మారి.. అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ డేట్ ను హీరో నాగార్జున స్వయంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.


ఆ డేట్ తో ఆయనకున్న అనుబంధం ఏమిటనేది తెలియదు కానీ ప్రస్తుతమైతే ఈ రెండు సినిమాలు అక్టోబర్ 5న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు బెల్లంకొండ చిన్న కొడుకు గణేష్ నటించిన తొలి సినిమా 'స్వాతి ముత్యం' కూడా ఇదే రోజున విడుదల కాబోతుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. మరి ఈ మూడు సినిమాల్లో దేనికి మంచి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి!


చిరు 'గాడ్ ఫాదర్' సినిమా విషయానికొస్తే.. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కథ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. అలానే చిరు, సల్మాన్ ల కాంబినేషన్ లో ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది.


మలయాళంలో  సూపర్‌ స్టార్ మోహన్‌లాల్(Mohan lal) నటించిన 'లూసిఫర్'కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. . పృథ్వీరాజ్ సుకుమారన్  దర్శకత్వంలో తెరకెక్కిన 'లూసిఫర్' చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. అదే రేంజిలో ఇక్కడ కూడా సినిమా సక్సెస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.