కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కథానాయకుడిగా నటించిన సినిమా 'ది ఘోస్ట్' (The Ghost Telugu Movie). ఇందులో సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన స్టిల్స్, టీజర్, ట్రైలర్ చూస్తుంటే... అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనేది అర్థం అవుతోంది.
తెలుగులో నాగార్జున మాజీ ఇంటర్ పోల్ ఆఫీసర్ రోల్ చేస్తుండగా... హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఏజెంట్ తరహా రోల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాల్లో యాచ్ షాట్ చూస్తే తెలుస్తుంది. సీన్స్ మాత్రమే కాదు... మాంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది. ఆ పాటను ఈ నెల 16న విడుదల చేస్తున్నారు.
The Ghost First Single Vegam : నాగార్జున, సోనాల్ చౌహాన్ మీద చిత్రీకరించిన రొమాంటిక్ గీతం 'వేగం'ను శనివారం విడుదల చేయనున్నారు. భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటకు సంగీతం అందించగా... కపిల్ కపిలన్, రమ్య బెహరా ఆలపించారు. కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు.
'వేగం' సాంగ్ నుంచి ఒక స్టిల్ కూడా విడుదల చేశారు. అందులో నాగార్జున, సోనాల్ చౌహాన్ క్రూయిజ్‌లో ఉండటాన్ని చూడవచ్చు. సోనాల్‌ను నాగార్జున ప్రేమగా దగ్గరకు తీసుకోవడంతో పాటు బుగ్గపై చిన్నగా ముద్దు పెడుతున్నారు. పోస్టర్‌తో పాటు సోనాల్ కాస్ట్యూమ్ రొమాంటిక్‌గా ఉంది.
Also Read : చంపు లేదంటే చావు - ఇది కథ కాదు, గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన సామాన్యుడి (ముత్తు) జీవితం
'ది ఘోస్ట్' సినిమా ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే, వచ్చే నెలలో... అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం తెలిపింది. లేటెస్టుగా మరోసారి ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఖండించారు. అక్టోబర్ 5నే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని కన్ఫర్మ్ చేశారు.
ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమాతో నాగార్జున విజయం అందుకున్నారు. అందులో ఆయనది చిన్న పాత్ర అయినప్పటికీ... మంచి పేరు వచ్చింది. హిందీ ప్రేక్షకులు ఆయన పాత్ర గురించి మాట్లాడుతున్నారు. 'బ్రహ్మాస్త్ర' విజయం తర్వాత నాగార్జున నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ది ఘోస్ట్' సినిమాపై హిందీ ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది. ఇక, ప్రవీణ్ సత్తారు గురించి నాగార్జున మాట్లాడుతూ ''నేను 'గరుడవేగ' చూసిన తర్వాత ప్రవీణ్ సత్తారుతో సినిమా చేయాలని పిలిచా. అతను ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఇన్నాళ్ళు అతనితో ఎందుకు చేయలేదని బాధ పడుతున్నాను'' అని తెలిపారు.
'ది ఘోస్ట్' సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ మాత్రమే కాకుండా సినిమాలో సిస్టర్ సెంటిమెంట్, రొమాన్స్ కూడా ఉన్నాయని యూనిట్ చెబుతోంది.