చిరంజీవి, నాగార్జున, రానా, ఎన్టీఆర్, నాని... ఇలా స్టార్ హీరోలు హోస్ట్ అవతారమెత్తి సక్సెస్ అయ్యారు. ఆ తరువాత బాలకృష్ణ హోస్ట్ రాబోతున్నట్టు ప్రకటించింది ఆహా ఓటీటీ. అప్పుడంతా ఆశ్చర్యపోయారు. సీరియస్ గా కనిపించే బాలయ్య హోస్ట్ గా రాణించగలరా అని సందేహించారు. ఆయనకు ముక్కు మీద కోపం అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. కానీ అన స్టాపబుల్ హోస్టింగ్ చూశాక అందరి అభిప్రాయం తప్పని రుజువైంది. వచ్చిన గెస్టులను రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి జోకులేస్తూ, హడావిడి చేస్తూ షోను చక్కగా  ముందుకు నడిపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా హుందాగా షో సాగేలా చేశారు. అందుకే అన్ స్టాపబుల్ షోకు చాలా క్రేజ్ వచ్చింది. వారానికో ఎపిసోడ్ విడుదల చేస్తుంటే, వాటి కోసం ఎంతో మంది వెయిట్ చేసేవారు. మొదటి సీజన్ 10 ఎపిసోడ్లతో ముగిసింది. మొదటి ఎసిపోడ్ కు మంచు ఫ్యామిలీ అతిధులుగా వచ్చారు. తరువాత రవితేజ, పుష్ప సినిమా టీమ్, అఖండ్ సినిమా టీమ్, బ్రహ్మానందం, మహేష్ బాబు, రాజమౌళి వంటి సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ప్రతి ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. 


సీజన్ 2కు శ్రీకారం
అన్‌స్టాపబుల్ సీజన్2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. వారి కోసం ఆహా ఓటీటీ అన్ స్టాపబుల్ సీజన్ 2ను ప్రకటించింది. బాలయ్య ఇండియన్ ఐడెల్ లో మాట్లాడిన వీడియోతో ‘అన్ స్టాపబుల్2  కమింగ్ సూన్’ అని పోస్టు పెట్టింది ఆహా. కొద్ది రోజుల క్రితం ఇండియన్ ఐడెల్ షోకి గెస్ట్ గా వెళ్లారు బాలయ్య. అప్పుడు అన్ స్టాపబుల్ గురించి యాంకర్ ప్రశ్నించగా ‘మధురక్షణాలకు ముగింపు ఉండదు, కొనసాగింపే...’ అన్నారు. ఆ వీడియోనే ఇప్పుడు ఆహా ఓటీటీ వినియోగించుకుంది. అయితే ఆహాలో ఈ సీజన్ 2 ఎప్పట్నించి ప్రసారం అవుతుందో మాత్రం ఇంకా ప్రకటించలేదు. షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం లేదు. త్వరలోనే తొలి అతిథితో షూటింగ్ మొదలవ్వనుంది.