పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది సంక్రాంతికి సినిమా రావడం ఖాయమని అనుకున్నారు. జనవరి 14న రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. లాస్ట్ మినిట్ లో సినిమాను పోస్ట్ పోన్ చేశారు. అనేక వాయిదాల అనంతరం మార్చి 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. 


ఈ సినిమా తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మాత్రం తమన్ ను రంగంలోకి దింపారు. ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా తమన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'రాధేశ్యామ్' సినిమా గొప్ప ప్రేమ కథా చిత్రమని.. ఈ సినిమా అందరి మనస్సులో నిలిచిపోతుందని అన్నారు. 


ఈ సినిమా స్థాయికి తను సరితూగనని.. అయినప్పటికీ తనపై నమ్మకంతో బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ చేయమని యూవీ క్రియేషన్స్ వారు అడిగారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే భావిస్తున్నట్లు చెప్పారు. 'రాధేశ్యామ్' పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ.. తను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. 


తన చేతుల్లో ఏ సినిమా లేక ఇబ్బంది పడుతున్న సమయంలో యూవీ క్రియేషన్స్ వారు 'మహానుభావుడు', 'భాగమతి' వంటి సినిమాలకు పని చేసే అవకాశం ఇచ్చారని.. అందుకే వారి రుణం ఇలా తీర్చుకుంటున్నట్లు చెప్పారు. ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే తమన్ 'రాధేశ్యామ్' సినిమాకి ఫ్రీగా పని చేయడం హాట్ టాపిక్ గా మారింది.