తమిళ నాట అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. ఆయన నటించిన 'వారసుడు' సినిమా రీసెంట్ గా పలు భాషల్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 'లియో' చిత్రంలో నటిస్తున్నారు. విజయ్, కనగరాజ్ కలిసి గతంలో ‘మాస్టర్’ అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ‘లియో’ మూవీతో మరోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.






‘లియో’ విషయంలో మనసు మార్చుకున్న విజయ్


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి ‘లియో’ మూవీ పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కించడం విజయ్ కి ఇష్టం లేదట.  'లియో' సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చితే చాలని ఆయన కోరుకున్నారట. అయితే, నిర్మాతలు ఆయనను కొద్ది రోజుల పాటు ఒప్పించడంతో మనసు మార్చుకున్నారట. తాజాగా ఈ విషయాన్ని ‘లియో’ నిర్మాత లలిత్ కుమార్ వెల్లడించారు.  ‘‘లియో.. సినిమా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కడం విజయ్ కి ఇష్టం లేదు. తమిళ ప్రేక్షకులను సంతృప్తి పరిస్తే చాలు అని చెప్పారు. అయితే, నిర్మాతలం (లలిత్, జగదీష్) ఆయనను కష్టపడి ఒప్పించడంతో మనసు మార్చుకున్నారు. సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావడానికి ఒరిజినల్ కథలో కొన్ని మార్పులు కూడా చేశారు” అని ఆయన వెల్లడించారు.


అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ‘లియో’ విడుదల


ఇక ‘లియో’  చిత్రాన్ని ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజు... ఇప్పటికే విజయ్ తో ‘మాస్టర్’ తెరకెక్కించి హిట్ అందుకున్నారు. దీంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.400కు పైగా జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2023 అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా 'లియో' రిలీజ్ కాబోతుండడంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 


Read Also: చిరంజీవి, బాలయ్య రికార్డులను వెనక్కి నెట్టిన అఖిల్, ఆ విషయంలో అయ్యగారే నెంబర్ వన్!