మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా మూవీ ‘గాడ్‌ ఫాదర్‌’ నుంచి  ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ ఫుల్ లిరికల్‌ సాంగ్ ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో సల్మాన్ ఖాన్, చిరంజీవి అదిరిపోయే స్టెప్పులతో దుమ్మురేపారు. ఈ పాటను యువ గేయ రచయిత  అనంత శ్రీరామ్‌ రాయగా.. బాలీవుడ్ టాప్ సింగర్ శ్రేయా ఘోషల్ ఆలపించింది. టాలీవుడ్ పాపులర్ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందించారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభు దేవా ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళ హిట్ మూవీ ‘లూసీఫర్’కు రీమేక్ గా తెరకెక్కుతున్నది. దసరా కానుకగా  అక్టోబర్ 5న ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ అంటూ సాగే ఈ పాటకి చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ సూపర్ డూపర్ డ్యాన్స్ చేశారు. పాట మొదలు కాగానే చిరంజీవి తన ముఖం మీద చేయి వేసుకుని స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు.  సల్మాన్‌ గోళ్లు కొరుకుతూ అడుగు పెట్టాడు. ఆ తర్వాత వీరిద్దరు ప్రేక్షకుల్లో జోష్ నింపేలా స్టెప్పులు వేశారు. పనిలో పనిగా ఈ లిరికల్ సాంగ్ లో పాట చిత్రీకరిణకు సంబంధించిన విజువల్స్ కూడా చూపించారు. సెట్స్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది.  ప్రభుదేవా డాన్స్ స్టెప్స్ నేర్పిస్తున్న సీన్లు బాగున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే, అభిమానులను మాత్రం ఈ పాట ఆకట్టుకోలేకపోతోంది. కారణం.. తమన్. ఈ పాటలోని మ్యూజిక్ గత సినిమాల్లో పాటలను తలపిస్తున్నాయని అభిమానులు అంటున్నారు. ‘సరైనోడు’, ‘క్రాక్’ తదితర మూవీల్లోని పాటలన్నీ కలిపి రీమిక్స్ చేసినట్లుగా ఉన్నాయంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. అలాగే, ఇందులోని స్టెప్స్ కూడా ఆకట్టుకొనేలా కనిపించలేదని పలువురు అంటున్నారు. అయితే, ఇది కేవలం లిరికల్ సాంగ్ మాత్రమే. పూర్తి పాట విడుదలైతే తప్పకుండా అభిమానులకు నచ్చేస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. 


 అటు ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు ఓరేంజిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కింది. సినిమాపై ఇవి మరిన్ని అంచనాలను పెంచాయి. చిరంజీవి మెయిన్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘లూసీఫర్’ సినిమాలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రను ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తొలుత తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. కానీ, చిరవకు తెలుగు, హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు.


‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇందులో నయనతార సత్యప్రియ జయదేవ్ గా కనిపించబోతుంది. పొలిటికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని రామ్‌ చరణ్‌, ఎన్‌. వి. ప్రసాద్‌, ఆర్‌. బి. చౌదరి కలిసి నిర్మిస్తున్నారు.    దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.