Telugu Film Producers Council on Hanuman Theaters Issue In Nizam: 'హనుమాన్' సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. థియేటర్లకు ప్రేక్షకులకు క్యూ కడుతున్నారు. మార్నింగ్ టు మిడ్ నైట్... ప్రతి షో హౌస్ ఫుల్ అవుతోంది. అయితే... సినిమా చూడాలని కోరుకునే ఆడియన్స్ డిమాండ్ మేరకు షోలు పడటం లేదన్నది వాస్తవం. సంక్రాంతి బరిలో మహేష్ బాబు 'గుంటూరు కారం' ఉండటంతో మెజారిటీ థియేటర్లు ఆ సినిమాను ప్రదర్శిస్తున్నాయి.
అసలే థియేటర్లు దొరకడం లేదంటే... ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న నాలుగు థియేటర్లు (ఎగ్జిబిటర్లు) చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చి, పెద్ద సినిమా 'గుంటూరు కారం'ను ప్రదర్శించడం 'హనుమాన్' డిస్ట్రిబ్యూటర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇష్యూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC)కి చేరింది. ఆ సమస్యపై నిర్మాతల మండలి ఓ లేఖ విడుదల చేసింది.
'హనుమాన్'కు న్యాయం చేయాలి!
''మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ 'హనుమాన్' సినిమా ప్రదర్శన కోసం జనవరి 12 నుంచి తెలంగాణలో కొన్ని థియేటర్లు వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ, సదరు థియేటర్ల వారు అగ్రిమెంట్ బేఖాతరు చేస్తూ నైజాం ఏరియాలో సినిమాను ప్రదర్శించలేదు.
ఆ విషయమై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్, 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. థియేటర్ల అగ్రిమెంట్ ప్రకారం 'హనుమాన్' సినిమా ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం జరిగింది. కాబట్టి ఆ థియేటర్లు వెంటనే 'హనుమాన్' ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్టం భరించాలి. థియేటర్ల వారి ఇటువంటి చర్యలకు పాల్పడటం వలన తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం. థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తోంది. ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం నైతికత నిబద్దత న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ఎగ్జిబిటర్లు ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని గౌరవిస్తూ 'హనుమాన్' నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు సత్వర న్యాయం చేయాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరుతున్నది'' అని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి లేఖలో పేర్కొంది.
Also Read: సైంధవ్ రివ్యూ : సైకోగా వెంకటేష్ ఎలా చేశారు? ఆయన 75వ సినిమా హిట్టా? ఫట్టా?
నాలుగు థియేటర్లలో హనుమాన్ ప్రదర్శిస్తారా?ఇప్పుడు నైజాంలోని ఆ నాలుగు థియేటర్లలో 'హనుమాన్' చిత్రాన్ని ప్రదర్శిస్తారా? లేదంటే నిర్మాతల మండలి లేఖను బేఖాతరు చేస్తారా? అనేది చూడాలి. 'హను మాన్' బదులు ఆ థియేటర్లలో 'గుంటూరు కారం' ప్రదర్శించారు. అయితే... సూపర్ స్టార్ సినిమాకు సూపర్ హిట్ టాక్ రాలేదు. అందువల్ల, 'హనుమాన్' ప్రదర్శనకు ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.
Also Read: గుంటూరు కారం రివ్యూ: మహేష్ బాబు ఎనర్జీ & ఆ మాస్ సూపర్, మరి సినిమా?