కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమస్యపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడడానికి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి స్టార్లు అమరావతికి వెళ్లారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. మరో వారం, పది రోజుల్లో గుడ్ న్యూస్ వస్తుందని మెగాస్టార్ చిరంజీవి మీడియా ముఖంగా వెల్లడించారు. 

 

ఈ క్రమంలో అసలు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య లేదని అంటున్నారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. టికెట్ రేట్ ఇష్యూ అసలు సమస్యే కాదని.. అసలు ఇండస్ట్రీ సభ్యులు ప్రభుత్వం దగ్గరకు ఎందుకు వెళ్లారో తనకి అర్ధం కావడం  లేదని అంటున్నారు తమ్మారెడ్డి. సీఎంల దగ్గర ప్రదక్షిణాలు చేసేవాళ్లకు ఏదైనా సమస్య ఉందేమో కానీ ఇండస్ట్రీలో మాత్రం ఎలాంటి సమస్య లేదని అన్నారు తమ్మారెడ్డి. 

 

పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు టికెట్ రేట్ ఒకటే ఉండడం సమస్య అని అంటున్నారని.. అలా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు తమ్మారెడ్డి. అది ఇండస్ట్రీ సమస్య ఎలా అవుతుందని అన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు ఎన్ని థియేటర్లలో విడుదలవుతున్నాయి..? చిన్న సినిమాలు ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందని అడిగారు. 

 

ఊర్లో ఉన్న సినిమా థియేటర్లన్నీ కబ్జా చేసే ఇంకా రేట్లు పెంచమని అడగడమంటే.. జనాల డబ్బు మొత్తం దోచుకోవాలనుకుంటున్నారా..? అంటే దోపీడీను మీరు సపోర్ట్ చేస్తున్నారా..? అది కరెక్ట్ అని అనుకుంటున్నారా..? అంటూ ప్రశ్నించారు. 

 

ఆర్ నారాయణమూర్తి గారి సినిమా వస్తే.. యాభై నుంచి అరవై థియేటర్లలో విడుదల చేస్తారని.. పెద్ద సినిమా వచ్చినప్పుడు ఏపీ, తెలంగాణలో అన్ని థియేటర్లలో విడుదల చేస్తారని అన్నారు. అలాంటప్పుడు థియేటర్ల గురించి కూడా మాట్లాడాలి కదా అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఆర్ నారాయణమూర్తి లానే కొన్ని థియేటర్లలోనే సినిమాను విడుదల చేసి టికెట్ రేట్ రెండు వేలు పెట్టి అమ్ముకోండి.. అప్పుడు గవర్నమెంట్ ను అడుగుదామని అన్నారు. 

 

ఊర్లో ఉన్న నాలుగు వేల థియేటర్లు కావాలి.. టికెట్ రేట్లు పెంచేయాలి.. జనం దగ్గర ఉన్న డబ్బు మొత్తం దోచుకోవాలి.. దీన్ని దోపిడీ అనకపోతే ఇంకేం అనాలి అంటూ ప్రశ్నించారు. ఏమైనా అంటే భారీ బడ్జెట్ సినిమా అంటున్నారు.. అందుకే కదా.. అన్ని థియేటర్లలో వేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు కదా.. ఇంకెంత కావాలి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 'అఖండ'కి లేని సమస్య, 'పుష్ప'కి లేని సమస్య.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, డీజే టిల్లుకి లేని సమస్య మీకేంటి..? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.