పాన్ ఇండియా స్టార్, మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ టు నార్త్.. పలు భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది.  దక్షిణాదిలో తమన్నాకు మంచి హిట్సే ఉన్నాయి. కానీ, బాలీవుడ్‌లో మాత్రం చెప్పుకోదగిన హిట్స్ దక్కలేదు. అయినా ప‌ట్టు వ‌ద‌ల‌కుండా హిందీలో సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ దర్శకత్వంలో ‘బబ్లీ బౌన్సర్‌’ అనే సినిమా చేస్తోంది. బాక్స‌ర్స్ టౌన్ గా గుర్తింపు తెచ్చుకున్న అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. 


మాస్ లుక్ లో మిల్కీ బ్యూటీ


ఇందులో తమన్నా మాస్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. బాక్సర్స్ ఊళ్లో లేడీ బాక్సర్ గా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. మగ రాయుడిగా బలాదూర్ తిరిగే అమ్మాయిగా ఇందులో కనిపిస్తుంది. మెడికల్ షాప్ కు వెళ్లి ఏమాత్రం బెరుకు లేకుండా ‘‘కండోమ్ ఇవ్వండి’’ అని అడిగేంత దమ్మున్న అమ్మాయి ఈ బబ్లీ. మల్లయోధురాలిగా, మగవాళ్లకు దీటుగా ఎదుగుతుంది. చివరకు ఢిల్లీలో లేడీ బౌన్సర్ గా ఉద్యోగం సంపాదిస్తుంది. అక్కడ ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోబోతుంది అనే విషయాన్ని సినిమాలో చూపించనున్నాడు దర్శకుడు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో తమన్నా బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం అని అంటున్నారు సినీ అభిమానులు. 






సెప్టెంబర్ 23 డిస్నీప్లస్ హాట్స్టార్లో రిలీజ్


‘బబ్లీ బౌన్సర్‌’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో థియేటర్లలో హిట్ అందుకోవాలని తమన్నా అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో థియేట‌ర్ల‌ను స్కిప్ చేయడమే మంచిది అనుకున్నారు దర్శకుడు మ‌ధుర్ భండార్క‌ర్. నేరుగా  ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. బబ్లీ బౌన్సర్ ను సెప్టెంబ‌ర్ 23న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదలకానున్నట్లు వెల్ల‌డించారు. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ఇప్పటికే పూర్త‌య్యాయ‌ని తెలిపారు.


లేడీ బౌన్సర్ ఆధారంగా స్తున్న తొలి సినిమా


గ‌తంలో తాను తెర‌కెక్కించిన సినిమాల‌కు భిన్నంగా బ‌బ్లీ బౌన్స‌ర్ ఉండ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్  తెలిపారు.  బాక్స‌ర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు చెప్పారు. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమాలో ఓ లేడీ బౌన్స‌ర్ గా న‌టించిందన్నారు. దేశంలో తొలిసారిగా ఓ లేడీ బౌన్స‌ర్ క‌థ ఆధారంగా వ‌స్తున్న తొలి సినిమా ఇదే అన్నారు. 


కెరీర్ లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్ర‌లో క‌నిపించ‌డం చాలా ఆనందంగా అనిపిస్తుందని తమన్నా చెప్పింది.  ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో నటించినట్లు వెల్లడించింది. మ‌ధుర్ ద‌ర్శ‌క‌త్వంలో తొలి సారిగా న‌టించ‌డం సంతోషంగా ఉందన్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. తమన్నా మ‌రోవైపు తెలుగులో చిరంజీవి స‌ర‌స‌న భోళాశంక‌ర్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌త్య‌దేవ్‌ తో క‌లిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది.