దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఆ తరువాత తెలుగులో కొన్ని కమర్షియల్ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడకి మకాం మార్చింది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. గతేడాది ఈ బ్యూటీ నటించిన మూడు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. 


'హసీనా దిల్ రూబా', 'అనాబెల్ సేతుపతి', 'రష్మీ రాకెట్' ఇలా ఆమె నటించిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'లూప్ లపేట' అనే సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. అయినప్పటికీ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తుంది తాప్సీ. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. 


ఇందులో పలు ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటికీ నెపోటిజం కారణంగా తను ఎఫెక్ట్ అవుతూనే ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇప్పటికే పలుసార్లు నెపోటిజం గురించి కామెంట్స్ చేసింది తాప్సీ. కొందరు దర్శకనిర్మాతలు ముందుగా తనకి సినిమా అవకాశం ఇచ్చి ఆ తర్వాత డబ్బు, పలుకుబడి, బందుప్రీతి వంటి కారణాలతో తనని తప్పించి ఇతరులకి అవకాశం ఇచ్చేవారని గతంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పడిందని.. అయినా నెపోటిజం కారణంగా ఇబ్బంది పడుతూనే ఉన్నానని అంటోంది. 


'రేప్పొద్దున ఒక రైటర్ మంచి స్క్రిప్ట్ తో నా దగ్గరకి వచ్చి, ప్రోపర్ డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ సెట్ అయితే.. వారి దగ్గర నా రీచ్ స్టార్ కిడ్స్ తో పోలిస్తే అంతా స్మూత్ గా ఉండదు. నేను ఏమైనా చెప్పాలనుకున్నా పెద్దగా వినరు' అంటూ చెప్పుకొచ్చింది. రీసెంట్ గా ఈ బ్యూటీ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టింది. దానికి 'అవుట్ సైడర్స్ ఫిలిమ్స్' అని పేరు పెట్టింది. అయితే ఇందులో కేవలం బయటవాళ్లకు మాత్రమే అవకాశాలు దొరకవని.. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తామని చెప్పుకొచ్చింది. బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా సినిమాలు తీస్తానని తెలిపింది.