Taapsee On Dunki Rumour : తెలుగు, తమిళ చిత్రాలతో స్టార్ హీరోయిన్​గా మారింది తాప్సీ పన్ను. సౌత్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కొద్ది కాలం పాటు టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపింది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో అక్కడికి వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూనే, మరోవైపు స్టార్‌ హీరోల సినిమాల్లోనూ మెరుస్తోంది. తాజాగా బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ తో కలిసి ‘డుంకీ’ అనే సినిమాలో నటించింది. ఈ నెల 21న విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ దక్కించుకుంది. వసూళ్ల పరంగానూ ఫర్వాలేదు అనిపిస్తోంది.


ఊహాగానాలే నిజం అయ్యాయి- తాప్సీ


‘డుంకీ’ ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ పన్ను ఈ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో వివరించింది. పనిలో పనిగా తన లవ్‌ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. “కొన్నిసార్లు ఊహాగానాలు నిజం అవుతాయి. ‘డుంకీ’లోని తన పాత్ర సైతం అలాంటిదే. ఈ సినిమా ప్రకటించిన కొత్తలో షారుక్‌ పక్కన నటించే లక్కీ ఛాన్స్‌ ఎవరికి వస్తుందో? అని చాలా మీడియా సంస్థలు కథనాలు రాశాయి. అదే సమయంలో చాలా మంది హీరోయిన్లు కూడా తమకు వస్తే బాగుటుంది అనుకున్నారు.  ఎలా మొదలైందో తెలియదు. కానీ, ఈ సినిమాలో నేను హీరోయిన్ గా నటిస్తున్నానని రూమర్ వచ్చింది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో నేను ఓ సౌత్ కొరియా సినిమాలో నటిస్తున్నాను. ఈ షూటింగ్ కోసం ఫారిన్ లో ఉన్నాను. అదే సమయంలో దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ నుంచి ఓ ఫోన్ వచ్చింది. ‘డుంకీ’ సినిమాలో నువ్వే హీరోయిన్‌ అని అందరూ చెప్తున్నారు. ఆ వార్త నిజం చేద్దామా? అని అడిగారు. ఇండియాకు రాగానే చెప్పు, వచ్చి స్టోరీ చెప్తాను అన్నారు. ఆ కాల్ తో నేను సంతోషంలో మునిగిపోయాను. అక్కడి నుంచి రాగానే వెంటనే వెళ్లి తనను కలిశాను. సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాను” అని తాప్సీ వెల్లడించింది.


మర్చిపోవడానికి చాలా టైం పట్టింది- తాప్సీ   


అటు తన లవ్ స్టోరీ గురించి కూడా తాప్సీ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. “తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో తొలిసారి ప్రేమలో పడ్డాను.  హైస్కూల్‌ లో తన సీనియర్‌, 10వ తరగతి అబ్బాయిని చూసి ఇష్టపడ్డాను. మొదట్లో నా పట్ల తను కూడా ఇంట్రెస్ట్‌ చూపించాడు. కానీ, చదువుకు ఇబ్బంది కలుగుతుందని నన్ను దూరం పెట్టాడు. ప్రేమ, గీమ వదిలేసి చదువు మీద ఫోకస్ పెట్టాలని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. నేను ఇష్టపడ్డ అబ్బాయి అలా మాట్లాడటంతో చాలా బాధపడ్డాను. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా టైమ్‌ పట్టింది” అని తాజాగా తన బ్రేకప్‌ స్టోరీని వివరించింది తాప్సీ.


Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్