సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే డాక్టర్‌తో బ్లాక్ బస్టర్ కొట్టి, విజయ్‌తో బీస్ట్ తీస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నారు. తమిళనాట పెద్ద బ్యానర్ అయిన సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాల్లో కథతో పాటు కామెడీకి కూడా పెద్దపీట వేస్తాడు. కాబట్టి ఈసారి రజినీకాంత్ నుంచి ఫుల్ లెంత్ ఎంటర్‌టైనర్‌ను ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.


నెల్సన్ కెరీర్ మొదటి నుంచి అనిరుధ్‌నే సంగీత దర్శకుడిగా కొనసాగిస్తున్నాడు. కొలమావు కోకిల (తెలుగులో కోకో కోకిల), డాక్టర్, బీస్ట్, ఇప్పుడు రజనీకాంత్ కొత్త సినిమా.. ఇలా నాలుగు సినిమాలకూ అనిరుధే సంగీతం అందిస్తున్నాడు. ఇక బీస్ట్ విషయానికి వస్తే.. ఏప్రిల్ 14వ తేదీన విడుదలకు సిద్ధం అవుతుంది.


రజనీకాంత్ మార్కెట్ ఇప్పటికే చాలా పడిపోయింది. రజనీ పూర్తి స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో 2010లో వచ్చిన రోబోనే రజనీ కొట్టిన చివరి బ్లాక్ బస్టర్. 2.0, పేట, దర్భార్ సినిమాలకు పర్వాలేదనిపించే కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక అన్నాత్తే (తెలుగులో పెద్దన్న) ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.