ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినిమాలు రీ రిలీజ్ హవా నడుస్తోంది. ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోలు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా 4K పేరుతో సినిమాలను రి-రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అలా తెలుగులో  కొన్ని సినిమాలు రిరిలీజ్ అయి మంచి కలెక్షన్స్ ను సాధించాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. కాగా ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాను కూడా రీరిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 12న రజనీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ‘బాబా’ సినిమాను ప్రపంచవ్యాప్త ప్రదర్శనకు ప్రణాళికలు రచిస్తున్నారు మేకర్స్. అయితే కేవలం రిరిలీజ్ కాకుండా సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి విడుదల చేయాలని యోచిస్తున్నారట. దాని కోసం స్పెషల్‌గా రజినీ కాంత్ మళ్లీ ఈ సినిమాలో డబ్బింగ్ కూడా చెబుతున్నారట. అలాగే మూవీలో కొన్ని కొన్ని సన్నివేశాలను యాడ్ చేస్తున్నారట. మరికొన్ని సన్నివేశాలను తీసేశారని తెలుస్తోంది. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ లో కూడా మార్పులు చేయడానికి సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ను కూడా సంప్రదించిందట మూవీ టీమ్. ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది.


‘బాబా’ సినిమా 2002 లో విడుదల అయింది. ‘నరసింహ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజనీ మూడేళ్ళు గ్యాప్ ఇచ్చి చేసిన సినిమా ఇది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయింది. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. మనీషా కొయిరాల హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీ కాంత్ ఈ సినిమాలో హీరోగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా వ్యవహరించారు. సినిమా విడుదల తర్వాత పూర్తి నెగిటివ్ టాక్ రావడంతో డిజాస్టర్ గా మిగిలిపోయింది. 


అయితే ‘బాబా’ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్ళు పూర్తయింది. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాను రజనీకాంత్ బర్త్  డే సందర్భంగా సరికొత్త మెరుగులద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సినిమా అప్పట్లో ఫ్లాప్ గా నిలిచినప్పటికీ ఇందులో రజనీ డైలాగ్స్, పాటలను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇప్పటికే ఈ సినిమా కొత్త వెర్షన్ ను ఇప్పటి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దారట. ‘బాబా’ రి రిలీజ్ ను బ్రహ్మాండంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నారట రజనీ ఫ్యాన్స్. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం. ‘బాబా’ ను పాన్ వరల్డ్ గా విడుదల చేయనున్నారు. మలేషియా, అమెరికా, యూఏఈ, సింగపూర్ సహా ఇతర దేశాల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదల పై అంచనాలు భారీగా పెరిగాయి.


Also Read : తెలుగులో విజయ్ పాడలేదు - మరి 'రంజితమే' సింగర్ ఎవరంటే?