సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘మైకేల్’ ట్రైలర్ సోమవారం విడుదల అయింది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది. ఫిబ్రవరి మూడో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.


ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా హీరోయిన్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ‘ఒక అమ్మాయి కోసం ఇదంతా చేస్తున్నావా మైకేల్’ అని విలన్ అడిగినప్పుడు ‘అవును మాస్టర్. అమ్మాయి కోసం కాకపోతే ఇంక బతకడం ఎందుకు?’ అని సందీప్ కిషన్ అంటాడు. ట్రైలర్‌లో వరుణ్ సందేశ్, అనసూయ, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ మీనన్ ఇలా పూర్తిగా స్టార్ కాస్ట్‌తో నింపేశారు. వరుణ్ సందేశ్ రక్తపు మడుగులో పడి ఉంటే తన పక్కన అనసూయ పడుకుని ఉండే షాట్ ట్రైలర్‌కే హైలెట్ అని చెప్పవచ్చు.


ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను జయం రవి, అనిరుథ్ రవిచందర్ విడుదల చేయగా, మలయాళం ట్రైలర్‌ను నివిన్ పాలీ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా వైడ్‌గా ఎంత క్రేజ్ తీసుకురావాలో అంత క్రేజ్ తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది చిత్ర బృందం.


ఈ సినిమా టీజర్ కూడా ఇటీవలే విడుదలై పెద్ద సక్సెస్ అయింది.  తెలుగులో న్యాచురల్ స్టార్ నాని, తమిళ్ లో హీరో ధనుష్, కన్నడలో రక్షిత్ శెట్టి ఇలా ఒక్కో భాషలో ఒక్కో హీరో టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో సందీప్ కిషన్ లుక్స్ కూడా అదిరిపోయాయి. సందీప్ కిషన్ ను మునుపెన్నడూ చూడని విధంగా ఈ టీజర్ లో చూపించారు.


టీజర్ లో సందీప్ సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. టీజర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో సాగే కథలాగా అనిపిస్తుంది. విజువల్స్ లో కూడా కొత్తదనం కనబడుతోంది. డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగా కుదిరాయి. టీజర్ మధ్యలో వచ్చిన డైలాగ్ అయితే ఓ రేంజ్ లో ఉంది.


‘మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్’ అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. దానికి హీరో బదులిస్తూ "వెంటాడి ఆకలి తీర్చుకోడానికి... వేటాడటం తెలియల్సిన పనిలేదు మాస్టార్" అని అంటాడు.  అలాగే టీజర్ చివరలో ‘మన్నించేటప్పుడు మనం దేవుడవుతాం మైఖేల్’ అనే డైలాగ్ కు కూడా హీరో బదులిస్తూ  "నేను మనిషిగానే ఉంటా మాస్టార్" అని అంటాడు. ఈ డైలాగ్స్ సినిమా పై మరింత ఆసక్తి పెంచాయి.


'మైఖేల్' తన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో సందీప్ కిషన్ చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని కోసం ఆయన సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. సుమారు 24 కిలోల బరువు తగ్గారు. 'మైఖేల్'తో కొత్త ప్రయత్నం చేశామని, తెలుగు ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందని టీజర్ విడుదల కార్యక్రమంలో సందీప్ కిషన్ చెప్పారు. తనకు ఇదే ఆఖరి సినిమా అన్నట్లు దర్శకుడు రంజిత్ జయకోడి సినిమా తీశారని, షూటింగులో హీరో కంటే ఎక్కువ రిస్కులు తీసుకున్నారని ఆయన వెల్లడించారు.