బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా.. విజయ్ సేతుపతిపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొట్టింది. విజయ్ పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికుంది..? అది కూడా ఎయిర్ పోర్ట్ లో అనే సందేహాలు తలెత్తాయి. దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. అసలేం జరిగిందంటే... ఇటీవల కన్నుమూసిన కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు నటుడు విజయ్‌సేతుపతి బెంగళూరు వచ్చారు. 


Also Read: విజయ్ సేతుపతిపై దాడి.. ఎగిరి మరీ తన్నాడు..


భద్రతా సిబ్బంది సహాయంతో ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వెళ్తుండగా, ఆయన పక్కనే ఉన్న సహాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఎగిరి కాలితో ఎగిరి తన్నాడు. ఈ వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాడికి యత్నించిన వ్యక్తిని వెనక్కి లాగేశారు. ఈ సంఘటనతో విజయ్‌సేతుపతి అవాక్కయ్యారు. వీడియో బయటకు వచ్చినప్పుడు అందరూ విజయ్ పై దాడి జరిగినట్లు భావించారు. కానీ అతడి సహాయకుడిపై అని స్పష్టత వచ్చింది. 


ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న కొద్దిసేపటి ముందు మద్యం సేవించి ఉన్న సదరు వ్యక్తితో విజయ్‌సేతుపతి సహాయకుడు వాగ్వాదానికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ కోపంతోనే సహాయకుడిని కాలితో తన్నాడని అంటున్నారు. భద్రతా సిబ్బంది జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పాడని తెలుస్తోంది.