మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్ ఆదివారం నాడు కన్నుమూశారు. కొన్ని రోజులు క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన ఆమె ఆరోగ్యం క్షీణించి ఫిబ్రవరి 6న మరణించారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకి నివాళులు అర్పించారు. కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సైతం లతా మంగేష్కర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చారు.
నివాళులు అర్పించే సమయంలో ఆయన చేసిన పనికి కొందరు దారుణంగా విమర్శిస్తున్నారు. షారుఖ్ తన మేనేజర్ పూజా దద్లానితో కలిసి లతా మంగేష్కర్ కి నివాళులు అర్పించే సమయంలో ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. అదే సమయంలో తన మాస్క్ ను కిందకు దించి ఆమె పాదాల దగ్గర ఊదాడు. దీన్ని తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు షారుఖ్.. లతా మంగేష్కర్ పాదాల వద్ద ఉమ్మేసినట్లు కామెంట్స్ చేస్తున్నారు.
షారుఖ్ ప్రవర్తనను తప్పుబడుతూ.. అతడిని ట్రోల్ చేస్తున్నారు. అయితే షారుఖ్ ఉమ్మేయలేదని.. భౌతిక కాయం వద్ద ఊదడం అనేది ఒక ప్రార్ధనా విధానమని ట్రోలర్స్ పై మండిపడుతున్నారు ఆయన అభిమానులు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం షారుఖ్ 'పఠాన్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.