Gupta Nidhulu In Warangal District: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. తవ్వకాలకు పాల్పడిన 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గంగదేవిపల్లి గ్రామానికి చెందిన యార మల్లారెడ్డి, మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన పంజరబోయిన శ్రీనివాస్, గంగదేవిపల్లికి చెందిన మేడిద కృష్ణ, నెక్కొండ మండలం అమీన్‌పేటకు చెందిన పూజారి యాత పూర్ణ చందర్‌లు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. అరెయార రమణయ్య , యార రాజయ్య, యార కుమారస్వామి, గీసుగొండ రాజిరెడ్డిలు పరారీలో ఉన్నారని చెప్పారు. తవ్వకాలలో బయటపడిన 30 రాగి నాణెలతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ పేర్కొన్నారు.
డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. యార మల్లారెడ్డికి గంగాదేవి గ్రామంలో సర్వే నెంబర్ 375లో 1.8 ఎకరాల భూమి ఉంది. తన పంట భూమిలో గుప్త నిధులున్నట్లుగా తెలుసుకున్నాడు. రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉన్నా అలా చేయలేదు. గుప్త నిధులు వెలికి తీయాలని నిర్ణయించుకున్న మల్లారెడ్డి గత నెల 23న అదే గ్రామానికే చెందిన పంజరబోయిన శ్రీనివాస్, మేడిద కృష్ణ, యాట పూర్ణచందర్‌లతో కలిసి తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాల్లో 1818 నాటి 30 పాత రాగి నాణేలను బయటపడ్డాయి. తర్వాత మహేష్ సహాయంతో హైదరాబాద్‌లో వాటిని విక్రయించేందుకు మరుసటి రోజు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం తెలియడంతో నిందితులపై నిఘా పెట్టారు. హైదరాబాద్‌లో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా వరంగల్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు నిందితులను గీసుగొండ పీఎస్‌లో అప్పగించినట్లు తెలిపారు.
గంగదేవిపల్లి యార మల్లారెడ్డి జరిపిన తవ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారం లభ్యమైనట్లుగా గ్రామస్తుల మధ్య చర్చ జరుగుతోంది. రాగి నాణెలతో పాటు దాదాపు 1000 బంగారు నాణెలు లభ్యమైన విషయం వారం రోజుల క్రితం గ్రామస్తులకు తెలిసినట్లు సమాచారం. దాదాపు రెండున్నర కిలోల వరకు ఉండొచ్చని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే విషయం బయటకు తెలిస్తే అసలుకే మోసం వస్తుందనే ఉద్దేశంతోనే బంగారం విషయం వెలుగులోకి రాకుండా రాగి నాణెల దొరికినట్లుగా సీన్ క్రియేట్ చేసినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా కేసును పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదని వాపోతున్నారు.
గంగదేవిపల్లిలో జరిగిన గుప్త నిధుల తవ్వకాల్లో భారీ ఎత్తున బంగారం లభ్యమైన విషయం ఓ ఇద్దరు పెద్ద నేతలకు తెలియడంతో విషయం ఆరా తీసి వాటాలు కోరుతున్నట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కేసును నీరుగార్చేందుకు, నిందితులను ఈ కేసు నుంచి రక్షించేందుకు బేరసారాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. తన భూమిలో గుప్తనిధులున్నట్లు యార మల్లారెడ్డికి ఎలా తెలిసింది..? పెద్దగా విలువలేని రాగి నాణెల విషయాన్ని రెవెన్యూ, పోలీసులకు చెప్పకుండా ఎందుకు దాయాల్సి వచ్చింది…? పూజారీని కూడా సమకూర్చుకోవడం వెనుక మల్లారెడ్డి పక్కా ప్లానింగ్ తో గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. మరి నేరం స్పష్టమైన నేపథ్యంలో పోలీసులు తర్వాత దర్యాప్తును ఏవిధంగా తీసుకెళ్తారో వేచి చూడాల్సి ఉంది.
Also Read: India Corona Cases: దేశంలో లక్ష దిగువకు పాజిటివ్ కేసులు, తాజాగా కొవిడ్‌తో 895 మంది మృతి
Also Read: Nizamabad News: ఇందూరు జిల్లా నిజామాబాద్ ఎలా అయ్యింది, పేరు మార్చడానికి కారణం ఇదే