తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విషాద ఘటనలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో చనిపోగా, రీసెంట్ గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి టీజీ గీతాంజలి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజాగా  మరో యువ నటుడు కన్నుమూశాడు. అతడు నటించిన సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చనిపోవడం అందరినీ ఆవేదనకు గురి చేసింది.  


గుండెపోటుతో యువ నటుడు హరికాంత్ మృతి


థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తున్న నటుడు హరికాంత్ హఠాన్మరణం పొందారు. ఇవాళ (శనివారం) ఉదయం గుండెపోటుతో ఈ యంగ్ హీరో కానరాని లోకాలకు వెళ్లిపోయారు. థియేటర్ ఆర్టిస్టుగా రాణించి, పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'కీడా కోలా'  అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది. ఇందులో పదునైన వేట కొడవలి పట్టుకుని కనిపించాడు హరికాంత్. ఈ సినిమాతో ఆయన సీనీ కెరీర్ మారుతుందనుకున్న తరుణం అందరినీ విషాదంలో ముంచుతూ వెళ్లిపోయాడు.


హరికాంత్ మరణం పట్ల పలువురి నివాళి


యువ నటుడు హరికాంత్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తున్న ఆయన చనిపోవడం బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నటీనటులు కోరుకుంటున్నారు. సినీ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు.  


హరికాంత్ తాజా చిత్రం 'కీడా కోలా'


దర్శకుడు  తరుణ్ భాస్కర్ స్వీయదర్శకత్వంలో  'కీడా కోలా' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజై సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'పెళ్లి చూపులు' 'ఈ నగరానికి ఏమైంది' సినిమాల తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి తరుణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ టీజర్ చూస్తుంటే మూవీ క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ గా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 8 పాత్రల చుట్టూ తిరగనుంది. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ ను కథను చెప్పకుండా ఆసక్తికరంగా రూపొందించారు. నాలుగైదు గ్రూపుల మధ్య కీడా కోలా సీసాలో  దాగున్న రహస్యం కోసం ఫైట్లు ఛేజింగ్లు చేస్తున్నట్లు చూపించారు.  తరుణ్ భాస్కర్  ఈ టీజర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ"కష్టపడ్డాం. పాలమ్మినం. ఇగ అంతా మీదే. తీసుకోండి' అని  రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని వివేక్ సుదాన్షు, సాయికృష్ణ గద్వాల్, కౌశిక్ నండూరి,  శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ కలిసి సంయుక్తంగా నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.







Read Also: మోహన్ లాల్‌తో చేతులు కలిపిన ఏక్తా కపూర్, ‘వృషభ’ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా?