శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'భళా తందానా'. ఇందులో కేథరిన్ త్రేసా కథానాయిక. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు.  వారాహి చలన చిత్రం (ఏ సాయి కొర్రపాటి ప్రొడక్షన్) పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.






'రాక్షసుడిని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి. నేను మామూలు మనిషిని' అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ తో 'భళా తందానా' టీజర్ స్టార్ట్ అయ్యింది. హీరోయిన్ కేథరిన్, పోసాని కృష్ణమురళి, కమెడియన్లు శ్రీనివాసరెడ్డి, 'స్వామి రా రా' సత్యను కూడా టీజర్ లో చూపించారు. హీరోతో 'నిజాయతీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామ‌న్ మ్యాన్‌కు కూడా రిస్కే' అని హీరోయిన్, 'హలో! ఈ రోజుల్లో లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకడం లేదు' అని కమెడియన్ సత్య చెప్పడం చూస్తుంటే... నిజాయతీ గల హీరో శ్రీవిష్ణు నటిస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతిపై హీరో, హీరోయిన్ ఎలా పోరాటం చేశారన్నది కథగా తెలుస్తోంది. 'కె.జి.యఫ్' గరుడ రామ్ అలియాస్ రామచంద్రమూర్తి విలన్ రోల్ చేశారు.






శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పీటర్ హెయిన్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: సురేష్ రగుతు, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్.