2021లో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ సర్వైవల్ గేమింగ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత దానికి రెండో సీజన్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే ఈ సెకండ్ సీజన్‌కు సంబంధించిన సాలిడ్ అప్‌డేట్‌ను అందించారు. బ్రెజిల్‌లో జరిగిన ‘టుడుమ్’ ఈవెంట్‌లో స్క్విడ్ గేమ్ సెకండ్ సీజన్‌కు సంబంధించిన క్యాస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
మొదటి సీజన్‌లో కనిపించిన లీ జంగ్ జే, లీ బ్యుంగ్ హున్, వి హా జున్, గాంగ్ యూ... రెండో సీజన్‌లో కూడా ఆయా పాత్రల్లో నటించనున్నారు. వీరితో పాటు యిం సి వాన్, కాంగ్ హా న్యూల్, పార్క్ సంగ్ హూన్, యాంగ్ డాంగ్ గ్యూన్ కొత్తగా స్క్విడ్ గేమ్ క్యాస్టింగ్‌లో చేరారు.
ఈ సిరీస్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పుడు విడుదల అవుతుంది? అనే అప్‌డేట్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ ఇవ్వలేదు. 2023లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, 2024లో సిరీస్ రిలీజ్ ఉంటుందని గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కానీ ఇప్పుడు మాత్రం రిలీజ్ టైమ్ లైన్‌ను స్కిప్ చేసింది. దీన్ని బట్టి సిరీస్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు.
స్క్విడ్ గేమ్ సీజన్ 1 నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించింది. కేవలం 28 రోజుల్లోనే 1.65 బిలియన్ గంటల వ్యూయర్ షిప్‌ను సొంతం చేసుకుంది. దీంతో పాటు అవార్డులను కూడా స్క్విడ్ గేమ్ సాధించింది. ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల్లో 14 నామినేషన్లను పొందింది. వీటిలో ఆరు అవార్డులను కూడా గెలుచుకుంది. అవుట్ స్టాండింగ్ డైరెక్టింగ్, ప్రొడక్షన్ డిజైన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్ పెర్ఫార్మెన్స్, లీడ్ యాక్టర్, యాక్ట్రెస్ ఇన్ గెస్ట్ రోల్ అవార్డులను స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ సాధించింది. లీడ్ యాక్టర్‌గా ఎమ్మీ గెలుచుకున్న మొదటి ఆసియా యాక్టర్‌గా లీ జంగ్ జే నిలిచాడు.
ఈ ఈవెంట్‌లోనే ఆలియా భట్ విలన్ రోల్‌లో నటిస్తున్న ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఈ మూవీలో గ్యాల్ గ్యాడట్, జామీ డోర్నాన్, సోఫీ ఒకొనెడో, మాథియాస్, జింగ్ లూసి, పాల్ రెడీ నటించారు. ఈ మూవీలో విలన్ పాత్రలో అలియా తొలిసారి హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా మూవీకు సంబంధిచిన ట్రైలర్ ను బ్రెజిల్ లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అలియా భట్ కూడా పాల్గొంది.
ట్రైలర్ విషయానికొస్తే.. దేశాన్ని ప్రమాదాల నుంచి రక్షించడానికి ఒక రహస్య గూఢచర్య టీమ్ ‘చార్టర్’ అనే పేరుతో పనిచేస్తుంది. ఈ టీమ్ ను గాల్ గాటోడ్ లీడ్ చేస్తుంది. ఇందులో ఆమె రాచెల్ స్టోన్ గా కనిపించింది. వీరంతా దేశం కుప్పకూలిపోయినపుడు పరిస్థితుల్ని ఈ టీమ్ ఆధీనంలోకి తీసుకుంటుంది. వీరికి ఎలాంటి ఎమోషన్స్, పొలిటికల్ ఎజెండాలు ఉండవు కేవలం దేశాన్ని కాపాడటం కోసమే ఈ మిషన్ పనిచేస్తుందని ట్రైలర్ లో చూపించారు. అయితే మూవీలో ప్రతి ఒక్కరు ‘ది హార్ట్’ అని పిలిచే ఒక మాక్ గఫిన్ కోసం వెతుకుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ‘చార్టర్’ మిషన్ కు బూస్ట్ ఇచ్చే పరికరం లాంటింది. ‘ది హార్ట్’ కోసం రెండు వర్గాలు పోటీ పడతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ట్రైలర్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు, గన్ ఫైట్లు ఇలా ట్రైలర్ మొత్తం ఉత్కంఠగా సాగింది.