ప్రముఖ నటుడు సోనూ సూద్‌పై ఉత్తర మధ్య రైల్వే శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. నలుగురికీ నచ్చజెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటూ మందలించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. డిసెంబర్ 13న సోనూ సూద్ దిల్లీలోని ఓ ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఫుట్‌బోర్డ్ మీద కూర్చుని ఉన్నప్పుడు తీసిన వీడియోను తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో షేర్‌ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కాస్త ఆలస్యంగా ఉత్తర మధ్య రైల్వే అధికారుల దృష్టికి రావడంతో వారు సోనూసూద్‌ని మందలించారు. 


‘‘సోనూసూద్‌ గారూ.. మీరు కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయులు. ట్రైన్ ఫుట్‌బోర్డ్‌పై కూర్చుని ప్రయాణించడం చాలా ప్రమాదకరం. మీరు ఇలాంటి వీడియోలు షేర్ చేస్తే మీ అభిమానులకు తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుంది. దయచేసి ఇలా చేయండి. ట్రైన్‌ జర్నీని సురక్షితంగా, హాయిగా ఆస్వాదించండి అని రైల్వే శాఖ అధికారులు ట్వీట్ చేసారు. ఈ వీడియోపై ముంబయి పోలీసు అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రైల్వే ఫుట్‌బోర్డ్‌పై కూర్చుని ప్రయాణించడం సినిమాల్లో చూడటానికి బాగుంటుందేమో. కానీ నిజ జీవితంలో కాదు. దయచేసి అందరూ మార్గదర్శకాలను అనుసరించండి’’ అని ట్వీట్ చేశారు.


ఈ వీడియో ఇంత దుమారానికి దారి తీస్తుందని తెలీని సోనూ సూద్ ఇక తన ట్విటర్ హ్యాండిల్ ద్వారా ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఆలోచించకుండా ఇలాంటి వీడియోను పోస్ట్ చేసినందుకు తనను క్షమించాలని, ఇప్పటికీ కొన్ని లక్షల మంది నిరుపేదలు అలా ఫుట్‌బోర్డ్‌పై కూర్చుని ప్రయాణిస్తుంటారని, వారి బాధలు ఎలా ఉంటాయో తెలుసుకుందామనే అలా చేశానని చెప్పారు. రైల్వే అధికారులు తనకు ఇచ్చిన సందేశానికి ధన్యవాదాలు తెలుపుతూ.. రైల్వే శాఖ సౌకర్యాలు బాగుపడినందుకు ఆనందం వ్యక్తం చేశారు.






భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో సోనూ సూద్ ఎంతో మందికి సాయం చేసి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. సొంత ఊళ్లకు వెళ్లలేక చిక్కుకుపోయిన ఎందరో ప్రజల కోసం సోనూ సొంత ఖర్చుతో బస్సులు ఏర్పాటు చేసి వారు సురక్షితంగా తమ ఇళ్లకు చేరేలా చేసారు. అంతేకాదు.. కరోనా సోకి హాస్పిటల్స్‌లో చేరే సమయంలో డబ్బు కడితే తప్ప చేర్చుకోలేం అని కొందరు హాస్పిటల్ యాజమాన్యాల ప్రవర్తన కారణంగా సాయం చేయండి సర్‌ అని ట్వీట్ చేయగానే తనకున్న నెట్‌వర్క్‌తో సోనూ ఏదో ఒక విధంగా వారికి సాయం అందేలా చేసి రీల్‌ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ ప్రశంసలు అందుకున్నారు. 


Read Also: అమెజాన్ ప్రైమ్ నుంచి ‘HIT 2’ తొలగింపు, అసలు కారణం ఏంటంటే?


ఇక సోనూ సినిమాల విషయానికొస్తే,. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య2 సినిమాలో విలన్‌ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైనప్పటికీ సోనూ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆయన హిందీలో ‘ఫతే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇందులో విలన్‌గా ఎవరు నటిస్తే బాగుంటుందో చెప్పండి అంటూ సోషల్‌మీడియాలో ఓ ట్వీట్‌ కూడా చేశారు. మంచి పేర్లను సజెస్ట్ చేసిన వారికి గిఫ్ట్ కూడా ఇస్తానని చెప్పారు.