Singer Chinmayi: ప్రముఖ సింగ్ చిన్మయి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనతో పాటు ఎంతో మంది మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన సినీ గేయ రచయిత వైరముత్తుతో కలిసి తమిళ సీఎం స్టాలిన్, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ప్రముఖ నటుడు కమల్ హాసన్ వేదికను పంచుకోవడంపై నిప్పులు చెరిగింది. ఎంతో మంది మహిళలను వేధించిన వ్యక్తికి ఎలా సన్మానం చేస్తారంటూ ప్రశ్నించింది.
వైరముత్తు పుస్తకావిష్కరణ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు
తాజాగా తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు'మహా కవితై' అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ప్రముఖ నటుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. వీరంతా కలిసి ఆయన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ ఫోటోను చిన్మయి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఘాటు వ్యాఖ్యలు చేసింది. “నన్ను లైంగికంగా వేధించిన వ్యక్తితో కలిసి తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖులు వేదికను పంచుకున్నారు. ఆయన నిజ స్వరూపం గురించి చెప్పిన నేను ఇండస్ట్రీ నుంచి నిషేధానికి గురయ్యాను. నా కెరీర్ ను కూడా కోల్పోయాను. నా కోరిక నెరవేరాలని కోరుకోవడం తప్ప, ప్రస్తుతానికి నేను చేసేది ఏమీ లేదు” అని చిన్మయి ట్వీట్ చేసింది.
వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది చిన్మయి. వందలాది పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ బాగా పాపులర్ అయ్యింది. స్టార్ హీరోయిన్లకు తన గాత్రదానం చేసింది. మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి రైటర్ వైర ముత్తు మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో ప్రోగ్రామ్స్ కు వెళ్లినప్పుడు ఆయన తనను వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం కలిగించాయి. చిన్మయితో పాటు మరికొంత మంది మహిళలు కూడా ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అతడు చెప్పిన మాటలు విననందుకు తన కెరీర్ మీద దెబ్బ కొట్టాడని, ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని గతంలోనే సీఎం స్టాలిన్ కు కూడా చిన్మయి లేఖ రాశారు.
ఇండస్ట్రీ నుంచి చిన్మయి బ్యాన్
అటు ఈ ఆరోపణలపై విచారణ జరిపి వైరముత్తు మీద చర్యలు తసుకోవాల్సింది పోయి, బాధితురాలైన చిన్మయి మీదే తమిళ ఇండస్ట్రీ నిషేధం విధించింది. ఈ నిర్ణయంపై చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు చేసింది ఒకరైతే, శిక్షపడింది మరొకరికి అని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటి నుంచి వైరముత్తుపై నిప్పులు చెరుగుతూనే ఉంది. ఇప్పుడు వైరముత్తుతో కలిసి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్, చిదంబరం, కమల్ పైనా విమర్శలు చేసింది.
Read Also: గొప్ప మనసు చాటుకున్న నటుడు జయరాం, 13 ఆవులను కోల్పోయిన యువ రైతుకు చేయూత