"చిన్నతనం నుంచి నటుడు అవ్వాలనేది నా కోరిక. సినిమాల్లో నాకు అవకాశాన్ని సృష్టించుకోవడం కోసం నేనే రచయితగా మారాల్సి వచ్చింది" అని హీరో సిద్ధూ జొన్నలగడ్డ అన్నారు. 'కృష్ణ అండ్ హిజ్ లీల'తో ఆయన రచయితగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'మా వింత గాధ వినుమా' రాశారు. ఇప్పుడు 'డీజే టిల్లు'కు ఆ చిత్రదర్శకుడు విమల్ కృష్ణతో కలిసి కథ రాశారు. ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. శనివారం ఈ 12న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సిద్ధూ జొన్నలగడ్డ మీడియాతో మాట్లాడారు.
- ఓ ప్రేమకథకు చిన్న క్రైమ్ యాడ్ చేసి 'డీజే టిల్లు' కథ రాసుకున్నాం. ఇందులో ప్రేమకథ ఎక్కువ, క్రైమ్ తక్కువ. నేను మల్కాజ్‌గిరి ఏరియాలో పెరిగా. అక్కడ యూత్ డిఫరెంట్. తమ దగ్గర ఏమీ లేకపోయినా దర్పం చూపిస్తారు. అందరితో స్నేహంగా ఉంటారు. ఎవరికైనా అవసరం అయితే సాయం చేస్తారు. చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్లలో నిజాయితీ ఉంటుంది. ఈ లక్షణాల స్ఫూర్తిగా తీసుకుని 'డీజే టిల్లు' క్యారెక్టర్ రాసుకున్నాం. అలాగే, నేను చూసిన పాత్రలను తెరపై చూపించాలని మిగతా పాత్రలు సృష్టించి కథ రాశాం.
'డీజే టిల్లు' పద్దతిగా రాసిన కథ కాదు. 'డీజే టిల్లు' క్యారెక్టర్ నుంచి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇచ్చిన సూచనల నుంచి పుట్టిన అంశాలు అన్నిటినీ కథగా రాసుకున్నాం. ఇందులో వినోదం ఉంటుంది. నవ్విస్తూ... చివర్లో మంచి విషయం చెబుతాడు. సందేశం ఇచ్చినట్టు ఉండదు. - 'డీజే టిల్లు' క్యారెక్టర్‌కు వస్తే... రాత్రంతా పోగ్రామ్స్ చేస్తాడు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తాడు. సాధారణంగా డీజేలు ఎలా ఉంటారో? అలాగే ఉంటాడు. కొత్త కొత్త ప్యాషన్స్ ఫాలో అవుతాడు. హెయిర్ స్టైల్, డ్రెస్ డిఫరెంట్ గా ఉంటాయి. కాకపోతే కంప్లీట్ తెలంగాణ యాసలో మాట్లాడతాడు. పెద్ద టాలెంటెడ్ కాదు. కానీ, రెండు మాస్ పాటలు చేసి వాటితోనే ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. ఏ రోజుకు వచ్చిన డబ్బులు ఆ రోజే ఖర్చు పెట్టేస్తాడు. హీరో డీజే టిల్లుతో పాటు హీరోయిన్ నేహా శెట్టిది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్.
- సితార సంస్థలో చాలా హ్యాపీగా సినిమా తీశాం. మాకు ఏం కావాలన్నా వంశీ గారు, చినబాబు గారు వెంటనే ఏర్పాటు చేసేవారు. మేం పెద్ద సమస్యలు అనుకున్న వాటిని చాలా ఈజీగా పరిష్కరించేవారు. 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమా చూసి సినిమా చేయమని నాగవంశీగారు ఆఫర్ ఇచ్చారు. ఆయన ఇటీవల సినిమా చూసి మెచ్చుకున్నారు. 'డీజే టిల్లు'ను పెద్ద సినిమాగా చేయవచ్చని త్రివిక్రమ్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఇటీవల సినిమా చూశాక "ఇది తప్పకుండా హిట్ అవుతుంది. ఏ రేంజ్ హిట్ అవుతుందనేది చూడాలి" అని అన్నారు. మేమూ సినిమా మీద నమ్మకంతో ఉన్నాం. ఎంత పెద్ద హిట్ అనేది చూడాలి.