బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఆయన ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తీర్థయాత్రలు చేపడుతున్నారు. ఆయన ప్రస్తుతం ‘డంకీ’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లిన ఆయన మక్కా మసీద్ ను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ‘డంకీ’ షూటింగ్ కోసం ఆయన కశ్మీర్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. షారుక్ ఖాన్ వైష్ణోదేవీ ఆలయం ఆవరణలో కనిపించిన వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఆయన తన సెక్యూరిటీ గార్డుల మధ్య నల్లటి హుడి కప్పుకొని వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మూడేళ్లుగా సినిమాలే లేవు
బాలీవుడ్ బాద్ షాగా పేరు తెచ్చుకున్న షారుక్ ఖాన్ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం `జీరో. ఈ సినిమా 2018 లో ప్రేక్షకుల ముందుకుకొచ్చింది. అయితే అనుకున్నంతగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఎలాంటి చిత్రాలు చేయాలా అనే అలోచనలో పడ్డారు షారుక్. దీనికి తోడు షారుఖ్ తనయుడు డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో తన తదుపరి సినిమా మరింత ఆలస్యం అయింది.
‘పఠాన్’తో రి ఎంట్రీ
షారుక్ ఖాన్ ‘జీరో’ సినిమా తర్వాత ‘పఠాన్’ సినిమా ఒప్పుకున్నారు. అయితే అనేక కారణాల వలన ఈ సినిమా మరింత లేట్ అయింది. దీంతో షారుక్ ఖాన్ సినీ కెరీర్ పై విమర్శలు మొదలైయ్యాయి. అయినా అవన్నీ పట్టించుకోలేదు షారుక్. ఎట్టకేలకు ‘పఠాన్’ మూవీ ట్రైలర్ తో షారుక్ ఖాన్ రి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు అందులో ‘ఆలస్యమేనని నాక్కూడా తెలుసు..కానీ ‘పఠాన్’ టైమ్ ఇప్పుడే మొదలైంది’ అంటూ వచ్చే డైలాగ్ కూడా షారుక్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అని హింట్ ఇచ్చే విధంగా ఉంటుంది. ట్రైలర్ లో ఈ డైలాగ్ చూసి షారుక్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారట.
వరుస సినిమాలతో బిజీ
షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉంటున్నారు. ఆయన చేతిలో ఇప్పుడు ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలు అన్నీ ఒకదానికొకటి భిన్నమైనవి కూడా. అందులోనూ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ‘పఠాన్’ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో షారుక్ సరికొత్త హెయిర్ స్టైల్ తో రా ఏజెంట్ సికందర్ పఠాన్ గా అలరించనున్నారు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. జాన్ అబ్రహం, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.