ఏ రంగంలోనైనా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తర్వాత పొగడ్తలతో పాటు అప్పుడప్పుడూ విమర్శలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో సెలబ్రెటీల విషయంలో ఇది స్పష్టంగా కనబడుతుంది. అందుకే సెలబ్రెటీలకు ఎప్పుడూ పూలే కాదు అప్పుడప్పుడూ రాళ్లు కూడా తగులుతూ ఉంటాయి. అవి ఒక్కోసారి పెద్ద దుమారమే రేపుతుంటాయి కూడా.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దర్శకుడు రాజమౌళికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. ఇక ఆస్కార్ అవార్డు రాకతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. రాజమౌళి అండ్ టీమ్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అయితే ప్రస్తతం రాజమౌళి ఆ ఆనందంలో ఉండగా తాజాగా ఆయనపై ఓ సీనియర్ ఆర్టిస్ట్ విమర్శలు గుప్పించారు. నటి కాంచన రాజమౌళి తనను అవమానించేలా మాట్లాడారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.
నటి కాంచన తెలుగు సినిమా రెండో తరం హీరోయిన్ లలో ఒకరు. ఆమె హీరోయిన్ గా తెలుగుతో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ లు పడే ఆటుపోట్లు గురించి చెప్పుకొచ్చారు. దానితో పాటు ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి కూడా మాట్లాడారు కాంచన. ఈ క్రమంలో ‘బాహుబలి’ సినిమా సమయంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు కాంచన.
‘బాహుబలి’ సినిమాలో ఓ పాత్ర కోసం రాజమౌళి తనను సంప్రదించారని చెప్పారు. రెండు రోజులు షూటింగ్ ఉంటుందని చెప్పారని, తాను అందుకోసం రూ.5 లక్షలు పారితోషికం అడిగానని అన్నారు. ఆ మాటకు రాజమౌళి కాసేపు ఆలోచించి అది మీకు చాలా ఎక్కువ అని అన్నారని చెప్పారు. ఆ పాత్రకు అంత ఇవ్వలేమని అవమానించినట్టు మాట్లాడారని వాపోయారు కాంచన.
తనకు ఇవ్వాలి అనుకుంటే రాజమౌళి దగ్గర లేని డబ్బా అని వ్యాఖ్యానించారు. ముసలి హీరోల కోసం కోట్లు ఖర్చు చేస్తారని, ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దని ఆర్టిస్ట్ ల కష్టాలు అలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. రూ.5 లక్షలు వాళ్ళకి పెద్ద ఎమౌంట్ కాకపోవచ్చు. కానీ అది తమకు చాలా పెద్ద ఎమౌంట్ అని చెప్పారు. తమకు ఇస్తే సేవకు ఉపయోగిస్తాం కదా అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో తనలాగ ఎంతో మంది సీనియర్ ఆర్టిస్ట్ లు ఉన్నారని, ఎలాంటి పాత్రలు ఇచ్చినా చేస్తారని, సినిమా రంగంలో ఆర్టిస్ట్ లు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంచన.
నటి కాంచన తండ్రి వ్యాపారవేత్త. ఆయన మొదట్లో వ్యాపారంలో నష్టపోతే కాంచన ఎయిర్ హోస్ట్ గా ఉద్యోగం చేశారు. తర్వాత తన పరిచయాలతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. గతంలో తాను కొన్నేళ్లు తండ్రి ఆస్తి విషయంలో వివాదాలు నడిచాయి. అయితే తర్వాత ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తనకు వారసత్వంగా వచ్చిన తండ్రి ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థాననికి రాసిచ్చేశారు కాంచన. ఆమె వివాహం కూడా చేసుకోలేదు. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆమె ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోకు నాన్నమ్మ పాత్రలో కనిపించారు.
Also Read : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల సినిమా ఎలా ఉందంటే?