బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న BSD DAV పబ్లిక్ స్కూల్ లో LKG బాలికపై ప్రిన్సిపాల్ కార్ డ్రైవర్ రజినీకుమార్ గత రెండు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడడం సంచలం అయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్ , ఆమె డ్రైవర్ పై పోక్సో కేసు పెట్టారు. ఈ కేసులో ప్రినిపల్ ను అరెస్టు చేశారు.

 

ఈ ఘటనపై టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 'డిఏవీ స్కూల్ లో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిని ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రేప్ చేశాడు. ఇది చాలా ఘోరమైన ఘటన. నిస్సహాయతతో ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఆ చిన్నారి పడే బాధను ఊహించడానికే కష్టంగా ఉంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ధైర్యంగా పోరాటం చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పిల్లల భద్రత విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆధునిక సమాజంలో ఇలాంటివి జరగకూడదు. వ్యవస్థ దీనిపై స్పందించాలి. అందరూ మేల్కొని చిన్నారుల భద్రతకు తగ్గట్లుగా ఈ సొసైటీని మార్చాలి. పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని రూపొందించినవారమవుతాం' అంటూ రాసుకొచ్చారు. 

 

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లవ్ స్టోరీ' సినిమా లైంగిక వేధింపులకు సంబంధించినదే.  బంధువులు, చుట్టుపక్కల వారే బాలికలను ఏ విధంగా లైంగిక వేధింపులకు గురి చేస్తారో ఈ సినిమాలో చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఇలాంటి సంఘటన జరగడంతో శేఖర్ కమ్ముల చలించిపోయారు. అయితే ఈ ఘటనపై సెలబ్రిటీలు ఎవరూ కూడా పెద్దగా స్పందించడం లేదు. సింగర్ చిన్మయి మాత్రం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. 

 

డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు: 

ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీఈవోకు  ఆదేశాలు జారీ చేశారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని మంత్రి సూచించారు. తాజా నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని డీఈవోను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సందేహాల నివృతి చేసేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. 

 

డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా పరమైన చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమిటీ నివేదిక రాగానే విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.