‘వారసుడు’ సినిమా తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న మూవీ ‘లియో’. ఈ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబో లో ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా విడుదల అయింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ ‘లియో’ మూవీపై ఆసక్తి పెరిగింది. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ టీజర్ వీడియోకు యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మూవీ పై ఏదొక వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘లియో’ సినిమా టైటిల్ పై ఓ కొత్త చిక్కు వచ్చిపడింది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జనవరి 2 నుంచి ప్రారంభమైంది. మొదటి దశ షూటింగ్ పూర్తవడంతో తాజాగా రెండో దశ షూటింగ్ కోసం మూవీ టీమ్ కశ్మీర్ కు వెళ్లింది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. విడుదలకు ముందే ఈ సినిమా దాదాపు రూ.400 కోట్లకు పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేసుకొని రికార్డు సృష్టించింది. అసలే లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ సినిమాతో ఓ కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేశాడు. ఇప్పుడీ యూనివర్స్ లో ‘లియో’ కూడా కలవబోతోందనే వార్తలు రావడంతో ఈ మూవీపై మరింత ఉత్కంఠ పెరిగింది.
‘లియో’ టైటిల్ మార్చాల్సిందే
ఇక ‘లియో’ సినిమా టైటిల్‌ను మార్చాలంటూ నామ్ తమిళ పార్టీ కో-ఆర్డినేటర్ సీమాన్ అన్నారు. ఇటీవల జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విజయ్ నటిస్తోన్న సినిమా ‘లియో’ టైటిల్ ను తమిళంలోకి మార్చాలని అన్నారు. తమిళ భాష అంతరించిపోకముందే మనం మారాలని చెప్పారు. విజయ్ సినిమాను తమిళులు అందరూ చూస్తారు. అందుకే విజయ్ కు కూడా బాధ్యత ఉండాలి. గతంలో తమిళ్ లో వచ్చిన సినిమాలు అన్నిటికీ తమిళ్ టైటిళ్లనే పెట్టేవారు. కానీ ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నారు. ఆ పరిస్థితి మారాలి అని సీమాన్ అన్నారు. దీంతో ఈ ‘లియో’ టైటిల్ పై గందరగోళం మొదలైంది. అయితే ‘లియో’ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇతర భాషల్లోకి కూడా విడుదల చేస్తారు అని ముందే మేకర్స్ ప్రకటించారు. మరి తాజాగా సీమాన్ వ్యాఖ్యలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకుంది. ప్రఖ్యాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్.లలిత్ కుమార్ ‘లియో’ను నిర్మిస్తున్నారు. జగదీష్ పళనిస్వామి ఈ చిత్రానికి సహ నిర్మాతగా చేరారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. అలాగే సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్, మైష్కిన్, అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.