మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీ మంచి  వసూళ్లతో దూసుకు పోతుంది. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, ప్రత్యేక పాత్రలో సల్మాన్ ఖాన్  లాంటి ఉద్దండులు నటించారు . అయితే, చిరంజీవి , నాయన తారల తండ్రి పాత్రలో ముఖ్యమంత్రిగా నటించిన నటుణ్ని మాత్రం చాలామంది తెలుగు ప్రేక్షకులు గుర్తించలేదు. ఆయనే సర్వదామన్  బెనర్జీ. చేసింది అతికొద్ది సినిమాలే ఆయినా తెరపై ఆయన వేసిన ముద్ర మామూలుది కాదు. 80వ దశకంలో అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఆయన. దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాధ్ తీసిన సిరివెన్నెల సినిమా హీరో ఆయన . 


1986 లో వచ్చిన సిరివెన్నెల మూవీ హీరో సర్వదామన్  బెనర్జీ


కళా తపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1986లో వచ్చిన సినిమా సిరివెన్నెల. అంధుడైన సంగీత కారుడు, మూగ పెయింటర్, వేశ్య అయిన మరో అమ్మాయిల కథతో అదిరిపోయే పాటలతో సిరివెన్నెల తెలుగు ఆల్ టైం క్లాసిక్ లలో ఒకటిగా నిలిచింది . ఆది భిక్షువు వాడి నేది అడిగేది , విధాత తలపున , చందమామ రావే -జాబిల్లి రావే,ఈ గాలీ- ఈ నేలా,మెరిసేతారలదే రూపం   లాంటి పాటలతో  తెలుగు సినిమాలల్లో అతిపెద్ద మ్యూజికల్ హిట్స్ లో అగ్రస్థానం లో నిలబడింది సిరివెన్నెల . ఈసినిమాతోనే సీతారామ శాస్త్రి .సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారారు . మ్యూజిక్ అందించింది  కేవీ మహదేవన్ . ఏకంగా 5 నంది అవార్డులను కైవసం చేసుకున్న సినిమా ఇది . దాన్లో హీరోగా నటించింది సర్వదామన్  బెనర్జీ .


తెలుగు రాదు ,పైగా అంధుడిగా నటన


తెలుగు భాష రాదు ..అందులోనూ సినిమా అంతా అంధుడి లా నటించాలి. ఇంత క్లిష్టమైన సవాలును కూడా అలవోకగా సాధించారు బెనర్జీ . 1983లో సంస్కృత భాషలో వచ్చిన ఆదిశంకరాచార్య సినిమాలో టైటిల్ పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నారు సర్వదామన్ . అది చూసి ఇంప్రెస్ అయిన విశ్వనాధ్ సిరివెన్నెల లో ఆయన్ను హీరోగా తీసుకున్నారు. ఆ వెంటనే చిరంజీవితో తాను తీసిన స్వయం కృషిలోనూ ఒక ముఖ్యపాత్రకు సుమలత భర్తగా సర్వదామన్ తో నటింపజేశారు . 


‘కృష్ణ’ సీరియల్ తో ఆధ్యాతిక మార్గంలోకి


హిందీ ,బెంగాలీ ,తెలుగు సినిమాల నుండి ఆఫర్స్ వస్తున్నప్పటికీ రామానంద సాగర్  1993లో తీసిన   కృష్ణ సీరియల్ లో శ్రీ కృష్ణుడి గా నటించారు బెనర్జీ. ఆ క్షణం నుండే ఆయన ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లడం ప్రారంభించారు . 1998 లో సుబ్బిరామిరెడ్డి నిర్మించిన స్వామి వివేకానంద లో టైటిల్ రోల్ పోషించిన ఆయన ఆ తరువాత రుషికేశ్ ,హరిద్వార్ లలోనే ఎక్కువగా ఉంటూ వచ్చారు .మధ్యలో అడపా దడపా ఒకటిరెండు పాత్రలు వేసినా.. తెలుగులో  మళ్ళీ ఇన్నాళ్లకు అంటే 35 ఏళ్ల తర్వాత గాడ్ ఫాదర్ సినిమా ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చారు .  


అప్పుడు చిరంజీవి సినిమాలో సెకండ్ హీరో -ఇప్పుడు తండ్రి


సర్వదామన్ చివరగా 1987 లో చిరంజీవి స్వయంకృషి సినిమాలో నటించారు. దాదాపు సెకండ్ హీరో పాత్ర . అప్పటినుండీ తెలుగు తెరకు దూరంగా ఉన్న ఆయన 35 ఏళ్ల తర్వాత గాడ్ ఫాదర్ లో చిరంజీవి కి తండ్రిగా కనిపించారు. చిరంజీవి ఏజ్ 67 అయితే సర్వదామన్ వయస్సు 57 కావడం విశేషం. ఏదేమైనా జనరేషన్ లు మారిపోవడం తో 35 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన సర్వదామన్ బెనర్జీ ని తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేదని సోషల్ మీడియాలో ఎక్కడా ఆయన ప్రస్తావన కనిపించక పోవడం బట్టి తెలుస్తోంది. మరి మీరైనా గుర్తుపట్టారా?


Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?


Also Read : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది