తీవ్ర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సీనియర్ నటుడు శరత్ బాబు గురించి తీవ్ర స్థాయిలో అసత్య వార్తలు ప్రసారం అవుతున్నాయి. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ తప్పుడు కథనాలు వస్తున్నాయి. యూట్యూబ్ ఛానెళ్ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆయన చనిపోయరంటూ వార్తలు వండి వడ్డిస్తున్నాయి. 


తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతాం- శరత్ కుమార్ కుటుంబ సభ్యులు


శరత్ కుమార్ గురించి తప్పుడు వార్తలు శృతి మించడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వార్తలు రాయడంపై మండిపడుతున్నారు. తెలిసీ తెలియకుండా అవాస్తవాలు ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శరత్ బాబు చనిపోయారంటూ వార్తలు ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్‌ తేజస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పబ్లిష్ చేసిన ఆ వార్తల్ని వెంటనే సదరు యూట్యూబ్‌ చానళ్లు, సోషల్‌ మీడియాలో తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం శరత్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారని ఆయుష్‌ తేజస్‌ వివరించారు. శరత్‌బాబు కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.


శరత్ బాబు చనిపోయినట్లు ట్వీట్లు చేసిన సెలబ్రిటీలు 


నటుడు శరత్ బాబు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. బెంగళూరులో ఉన్న ఆయనకు అనారోగ్యం చేయడంతో హైదరాబాద్ తీసుకువచ్చి ఏఐజీలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. అయితే, అనూహ్యంగా బుధవారం ఆయన చనిపోయారనే ప్రచారం మొదలైంది. పలువురు సెలబ్రిటీలు సైతం ఆయన మృతి పట్ల సంతాపం చెప్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని పోస్టులను డిలీట్ చేశారు. వీరిని చూసి నెటిజన్లకు కూడా శరత్ బాబు చనిపోయినట్లు ట్వీట్లు చేశారు. యూట్యూబ్ చానెళ్లు సైతం ఆయన చనిపోయినట్లు వార్తలు ప్రసారం చేశాయి. ఈ ప్రచారం పై ఆయన సోదరి స్పందించారు. ''సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పే! అన్నయ్య కొంచెం రికవరీ అయ్యారు. ఆయన్ను రూమ్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకుంటారు. మీడియాతో మాట్లాడుతారని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని తెలిపారు.  


ఆ వార్తలన్నీ అవాస్తవం- నటుడు శరత్ కుమార్


నటుడు శరత్ కుమార్ సైతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ట్వీట్ చేశారు. దయచేసి పుకార్లను, అసత్యాలను ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. శరత్ బాబు త్వరగా కోలుకోవాలని ఆశిద్దామని తెలిపారు.   






Read Also: షారుఖ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్, ‘జవాన్’ విడుదల వాయిదా, కారణం ఏంటంటే?