సరోగసీ నేపథ్యంలో సమంత (Samantha) ప్రధాన పాత్రలో 'యశోద' (Yashoda Movie)ను రూపొందించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
లవ్, ఎమోషన్, యాక్షన్ అండ్ థ్రిల్... రెండున్నర నిమిషాల కంటే తక్కువ నిడివి గల ట్రైలర్‌లో సమంత అండ్ టీమ్ చాలా చూపించారు. సినిమాపై మరింత క్యూరియాసిటీ కలిగించారు.
'యశోద' ట్రైలర్ ఎలా ఉంది?
How Was Samantha's Yashoda Trailer : 'యశోద' ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే... టీజర్‌లో సమంతను గర్భవతిగా చూపించారు కదా! అయితే... ఆ గర్భం వెనుక ఉన్న రహస్యాన్ని ట్రైలర్‌లో చెప్పేశారు. డబ్బులు అవసరం ఉండటంతో సరోగసీ కోసం తన గర్భాన్ని అద్దెకు ఇచ్చిన యువతిగా సమంత కనిపించారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.
Samantha's Yashoda Storyline : సరోగసీ గర్భం దాల్చిన యువతులు కొందర్నీ సకల వసతులు, వైద్య సౌకర్యాలు కల ఓ భవంతిలోకి తీసుకు వెళతారు. అక్కడ మొదట అంతా బానే ఉంటుంది. అయితే... ఓ అమ్మాయి కళ్ళు తిరిగి పడిన తర్వాత జరిగిన పరిణామాలు యశోదను ఆలోచనలో పడేసినట్టు అర్థం అవుతోంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించడం... ఆమెపై ఎటాక్ జరగడం... తదితర దృశ్యాలు సినిమాపై ఆసక్తి పెంచాయి.
'యశోద'లో సరోగసీ అంశంతో పాటు రాజకీయం, మర్డర్ మిస్టరీ, ప్రమాదం అంచున ఓ మహిళ చేసిన పోరాటం ఉన్నాయని చిత్ర బృందం స్పష్టం చేసింది. సమంత, ఉన్ని ముకుందన్ మధ్య లవ్ ట్రాక్ ఉంది. రాజకీయ నాయకుడిగా రావు రమేశ్ డైలాగ్, నటన ప్రేక్షకుల దృష్టిలో పడతాయి. ప్రపంచం నలువైపుల నుంచి సంపన్న మహిళలు వచ్చారని మురళీ శర్మ చెబుతారు. ఇవన్నీ ఆసక్తి కలిగించే అంశాలే. ట్రైలర్ చూస్తే... సరోగసీ కాన్సెప్ట్ రివీల్ చేశారు. అయితే... కథపై మరిన్ని ప్రశ్నలు రేకెత్తేలా చేసి ఇంకా ఆసక్తి పెంచాయి. ట్రైలర్‌లో సంభాషణలు గుర్తుండేలా ఉన్నాయి.
Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?
'నీకు ఎప్పుడైనా రెండు చప్పుళ్ళు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది!' అని సమంత చెప్పే డైలాగ్‌లో తల్లి కాబోయే మహిళ బిడ్డపై ఫీలయ్యే ప్రేమ, ఎమోషన్ ఉన్నాయి.
'యశోద ఎవరో తెలుసు కదా! ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి' అని సమంత చెప్పే మరో డైలాగ్‌లో హీరోయిజం ఉంది. అయితే... ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత కలియుగ పద్మవ్యూహంలో చిక్కుకున్న 'యశోద', దాన్నుంచి బయట పడటం కోసం పోరాటం చేసినట్లు అనిపిస్తుంది.
'యశోద' ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో 'మహానటి', 'సీతా రామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. వాళ్ళందరికీ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ థాంక్స్ చెప్పారు. ట్రైలర్‌కు అన్ని భాషల్లో అద్భుత స్పందన లభిస్తోందని, సరోగసీ కాన్సెప్ట్ రివీల్ చేసినప్పటికీ... స్టార్టింగ్ టు ఎండింగ్ తర్వాత తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠతో కథ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు.