‘యశోద’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సమంత, మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఆమె నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘శాకుంతలం’ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. గుణశేఖర్ తెరకెక్కించిన ఎపిక్ లవ్ స్టోరీ విడుదల తేదీ వెల్లడైంది. ఫిబ్రవరి 17, 2023  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించారు.  


ప్రపంచ వ్యాప్తంగా 2D, 3D వెర్షన్ లలో విడుదల


వాస్తవానికి ఈ సినిమాను 2020లో అనౌన్స్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా పలు మార్లు వాయిదా పడింది. షూటింగ్ సైతం చాలా కాలం కిందటే పూర్తయ్యింది. అయినా, 3D వెర్షన్ తో పాటు రకరకాల కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, తాజాగా సమంత నటించిన ‘యశోద’ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇదే ఊపులో ‘శాకుంతలం’ సినిమాను విడుదల చేస్తే మంచి సక్సెస్ అందుకోవచ్చని మేకర్స్ భావిస్తున్నారు. అందులో భాగంగానే కొత్త సంవత్సరం వేళ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు.  ఈమేరకు గుణ టీమ్ వర్క్స్ ట్విట్టర్ వేదికగా సినిమా విడుదల తేదీని వెల్లడించింది. “ఫిబ్రవరి 17, 2023న ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎపిక్ లవ్ స్టోరీని మీకు సమీపంలోని థియేటర్లలో చూడండి. 3D వెర్షన్‌ సైతం అందుబాటులో ఉంది” అని ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో సమంత శకుంతలగా నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.






‘శాకుంతంలం’ సినిమాపై భారీ అంచనాలు


‘శాకుంతలం’ సినిమాను కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించారు. తన కెరీర్ లో అద్భుత దృశ్య కావ్యంగా  ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. చారిత్రక సినిమాలను అద్భుతంగా తెరకెక్కించడంలో గుణ శేఖర్ ది అందెవేసిన చెయ్యి. దీంతో చాలా కాలం తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ అద్భుత సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. 2Dతో పాటు 3D వెర్షన్‌ లోనూ రిలీజ్ అవుతోంది.      


‘శాకుంతంలం’ మూవీకి పోటీ విడుదలయ్యే సినిమాలు ఇవే!


అటు ‘శాకుంతలం’ సినిమా రోజునే మరికొన్ని చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సర్’, మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘ధమ్కీ’, కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాలు సైతం అదే రోజున విడుదల కానున్నాయి.  


Read Also: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి సమంత ఔట్! - ఆ వదంతులే నిజమయ్యాయా?