బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పాటలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం విశేషం. ఈ సినిమాలో జగపతి బాబు విలన్ రోల్ లో కనిపించనున్నారు. రిలీజ్ కు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు జగపతి బాబు. ఈ సినిమాలో తన పాత్ర గురించి, తన పాత్ర విషయంలో సల్మాన్ తీసుకున్న జాగ్రత్తల గురించి వివరించారు. “సల్మాన్ ఖాన్ చాలా ఈజీగా నటిస్తారు. అతడి యాక్టింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది. సెట్స్ లో అందరికీ మార్గనిర్దేశనం చేస్తారు. అతడు అందరితో చాలా కలిసిపోతారు. వాస్తవానికి ఈ సినిమాలో మేం ఇద్దరం ఫైట్ చేయాల్సి ఉంటుంది. కానీ, కోవిడ్ లాంటి కారణాలతో చేయలేకపోయాం” అని చెప్పారు.  


సల్మాన్ కోసం జుట్టుకు నల్లరంగు వేసుకున్నా!


ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు సంబంధించి ఎలాంటి కండీషన్స్ లేవని చెప్పారు. “ఈ చిత్రంలో నా పాత్రకు సంబంధించి ఎలాంటి పట్టింపు నాకు లేదు. నా జుట్టుకు నల్ల రంగు వేసి యవ్వనంగా కనిపించేలా చేయాలని సల్మాన్ భావించారు. దీని వెనుక ఓ లాజిక్ ఉంది. తన కంటే పెద్ద వాడితో ఫైట్ చేయడం తనకు ఇష్టం లేదు. అందుకే, తను చెప్పినట్లుగానే జుట్టుకు రంగు వేసుకోవాల్సి వచ్చింది” అన్నారు. 


నేను విషయం గురించి ఆమెను అడగలేదు!


ఈ చిత్రం కోసం జగపతి బాబును సెలెక్ట్ చేయడం కోసం పూజా హెగ్డే ఏమైనా రికమెండ్ చేసిందా? అనే ప్రశ్న గురించి ఆయన స్పందించారు. తను నవ్వుతూ సమాధానం చెప్పారు. “పూజా నన్ను రాక్‌స్టార్ అని పిలుస్తుంది. ఆమె నా పేరు చెప్పి ఉండవచ్చు. చెప్పిందో? లేదో? కూడా నాకు తెలియదు. ఆమె నాకు చెప్పలేదు. నేను ఆమెను అడగలేదు” అని వెల్లడించారు. పూజా, జగపతి బాబు గతంలో  ‘రాధే శ్యామ్‌’ చిత్రంలో కలిసి పనిచేశారు.


మిగతా సినిమాల గురించి నేనేం చెప్పలేను!


సౌత్, నార్త్ సినిమా పరిశ్రమ గురించి కూడా జగపతి బాబు కీలక విషయాలు వెల్లడించారు. రెండు ఇండస్ట్రీల మధ్య పెద్ద తేడా ఏమీ కనిపించలేదన్నారు. “నిజంగా నాకు చాలా తేడా కనిపించలేదు. ఈ సినిమా చాలా కూల్ గా జరిగింది.  డబ్బు ఒత్తిడి, బడ్జెట్ ఒత్తిడి సహా ఎలాంటి ప్రెజర్ లేదు. అంతా సజావుగా సాగింది. నేను అన్ని బాలీవుడ్ సినిమాల గురించి చెప్పలేను. కానీ, ఈ ప్రాజెక్టు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది” అన్నారు. 


సౌత్ ఇండస్ట్రీ పాన్ ఇండియా బాటపట్టడం సంతోషకరం


సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపైనా జగపతి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. “’బాహుబలి’ సక్సెస్ తర్వాత సౌత్ ఇండియన్ సినిమా పాన్ ఇండియాకు వెళ్లాలని కోరుకుంటోంది. ఇది ఆరోగ్యకరమైన ధోరణిగా భావిస్తున్నాను.  ఎందుకంటే సినిమా ఒక్కటే ప్రపంచం. నటన విశ్వవ్యాప్తం. దానికి భాషా అవరోధం లేదు. ఒక రాష్ట్రం,  దేశం అడ్డంకి కాదు. ప్రపంచంలో ఎక్కడైనా నటించవచ్చు. పాన్ ఇండియన్ సినిమాలతో  ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. ‘పుష్ప 2’లో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది” అని వివరించారు.  


Read Also: సౌత్ ఇండస్ట్రీలో సంతృప్తి దొరకలే, మరోసారి నోరు పారేసుకున్న తాప్సి