ఆరు పదుల వయసు దగ్గర పడుతున్నా, ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఎంతో మందితో ప్రేమాయణాలు నడిపినా, ఇప్పటికే పెళ్లంటే నో అంటున్నారు. తన సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. అర్బాజ్ మలైకా అరోరాను పెళ్లి చేసుకోగా, సోహైల్ సీమా సజ్దేను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పలు కారణాలతో విడిపోయారు.
అప్పుడు నా మాట వినలేదు, ఇప్పుడు వింటున్నారు- సల్మాన్
తాజాగా సల్మాన్ ఖాన్ కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్నారు. అర్బాజ్, సోహైల్, ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా (KKBKKJ) ట్రైలర్‌ని చూసిన తర్వాత, పెళ్లి చేసుకోమని అడిగారా? అని కపిల్ సల్మాన్‌ని అడిగాడు. కపిల్ ప్రశ్నకు సల్మాన్ అసక్తికర సమాధానం చెప్పారు. “నిజానికి, వారు నా మాట వినరు. కానీ, ఇప్పుడు నా మాట వింటున్నారు” అని చెప్పడంతో షో అంతా నవ్వులతో నిండిపోయింది. సల్మాన్ ఖాన్ నటించి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా గత నెల ఈద్ సందర్భంగా విడుదలైంది. ఈ సినిమాలో సల్మాన్ తన ప్రేమను చెప్పేందుకు ఇబ్బందిపడే వ్యక్తిగా కనిపిస్తారు.
సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు, ఫిల్మ్ మేకర్ అయిన అర్బాజ్ ఖాన్, నటి, మోడల్ అయిన మలైకా అరోరాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1998లో పెళ్లి చేసుకున్నారు. పలు కారణాలతో 2017లో విడాకులు తీసుకున్నారు. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అర్బాజ్ జార్జియా ఆండ్రియాతో ప్రేమాయణం కొనసాగిస్తుండగా, మలైకా నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. సల్మాన్ మరో సోదరుడు సోహైల్ ఖాన్ సీమా సజ్దేను 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. గత ఏడాది ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
నిరాశ పరిచిన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'
సల్మాన్ ఖాన్ నటించిన రీసెంట్ మూవీ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. మొదటి ఆట నుంచి సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు కూడా సినిమాపై సరైన బజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన రీతిలో జరగలేదు. పది పన్నెండు ఏళ్లుగా రంజాన్ సందర్భంగా విడుదలైన ప్రతి సల్మాన్ ఖాన్ సినిమా బాక్సాఫీస్ బరిలో మొదటి రోజు మినిమమ్ 20 కోట్లు కలెక్ట్ చేసింది. అంత కంటే తక్కువ ఓపెనింగ్ డే కలెక్షన్స్ సల్మాన్ ఖాన్ రికార్డుల్లో లేదు. అటువంటిది 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'కు రూ.15 కోట్లు మాత్రమే వచ్చింది. తమిళంలో అజిత్ సుమారు పదేళ్ళ క్రితం చేసిన 'వీరం'ను సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు. కథలో కొన్ని మార్పులు చేసినా, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.
Read Also: హిందీలోనూ అదే రిపీట్ అవ్వుద్ది - ‘ఛత్రపతి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బెల్లంకొండ ధీమా!